శిక్షణను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకుని గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని సూచన
ఆసిఫాబాద్, జూలై 29:
కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆశ్రమ పాఠశాల ఉపాధ్యాయులకు నిర్వహిస్తున్న ఐదు రోజుల విషయాల వారీ శిక్షణ కార్యక్రమాన్ని ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి మంద మకరందు బుధవారం ఆకస్మికంగా సందర్శించి పరిశీలించారు.
శిక్షణ రెండో రోజు నిర్వహిస్తున్న ప్రతి సబ్జెక్టు తరగతిని స్వయంగా సందర్శించిన ఆయన, ఒక్కో తరగతిలో సుమారు గంటసేపు ఉపాధ్యాయులతో కలిసి కూర్చొని శిక్షణా విధానాన్ని పరిశీలించారు. శిక్షకులు బోధిస్తున్న అంశాలను ఆసక్తిగా విని, ఉపాధ్యాయులతో పరస్పరం చర్చిస్తూ బోధనలో నాణ్యత, వినూత్న బోధనా పద్ధతులు, విద్యార్థుల అభ్యాస ఫలితాల మెరుగుదలపై పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, శిక్షణను కేవలం హాజరు కార్యక్రమంగా భావించకుండా ప్రతి ఉపాధ్యాయుడు తన వృత్తి నైపుణ్యాలను మెరుగుపరుచుకునే అవకాశంగా వినియోగించుకోవాలని సూచించారు. శిక్షణలో నేర్చుకున్న ఆధునిక బోధనా విధానాలను తరగతి గదిలో సమర్థవంతంగా అమలు చేసి గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేయాలని ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు.
ప్రాజెక్ట్ అధికారి స్వయంగా శిక్షణా తరగతుల్లో పాల్గొని పరిశీలించడం ఉపాధ్యాయుల్లో ఉత్సాహాన్ని నింపిందని పలువురు అభిప్రాయపడ్డారు. విద్యా ప్రమాణాల మెరుగుదల కోసం ఇలాంటి పర్యవేక్షణలు, మార్గదర్శకాలు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ జాదవ్ అంబాజీ, పీఎంఆర్సీ ఏసీఏఎంఓ పూర్క ఉద్ధవ్, జీసీడీఓ కొట్నాక్ శకుంతల, జిల్లా క్రీడల అధికారి మాడావి శేఖు, కోర్సు డైరెక్టర్ కోడెం రవీందర్, ప్రధానోపాధ్యాయులు లింభారావు, రిసోర్స్ పర్సన్లు, శిక్షణ సమన్వయకర్తలు, వివిధ సబ్జెక్టుల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.



