ఖమ్మం, జూన్
(పువ్వాడ నాగేంద్ర కుమార్
పున్నమి జిల్లా రిపోర్టర్ )
జిల్లాలో రానున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీస్ యంత్రాంగం ముందస్తు అప్రమత్తంగా ఉండాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ పోలీస్ అధికారులను ఆదేశించారు. వర్షాలు, వరదలు మరియు నకిలీ విత్తనాల విక్రయాల నివారణపై జిల్లా పోలీస్ అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫిరెన్స్‌లో ఆయన మాట్లాడారు.
గతంలో కురిసిన భారీ వర్షాల అనుభవాలను దృష్టిలో ఉంచుకుని చెరువులు, కుంటలు, వాగులు, కాలువల వద్ద నీటి ఉధృతి కారణంగా దెబ్బతిన్న వంతెనలు, చప్టాలు, ముంపు ప్రాంతాలను పరిశీలించాలని సూచించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో స్థానిక ప్రజలతో నిరంతరం సంప్రదింపులు జరిపి ప్రమాదాలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలకు అవసరమైన సహాయాన్ని తక్షణమే అందించేలా సిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు.
వర్షాల కారణంగా ఎక్కడా ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా మున్సిపల్, రెవెన్యూ తదితర శాఖలతో సమన్వయం చేసుకుని రహదారులను ఎప్పటికప్పుడు క్లియర్ చేయాలని అధికారులకు సూచించారు.
అదేవిధంగా రైతులకు నాణ్యమైన విత్తనాలు అందేలా ప్రభుత్వం ఆదేశాల మేరకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రముఖ కంపెనీల పేరుతో నాసిరకం లేదా నకిలీ విత్తనాలు విక్రయించి రైతులను మోసం చేయాలని చూస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.
రైతులు విత్తనాల కొనుగోలు సమయంలో అప్రమత్తంగా ఉండాలని, తక్కువ ధరలకు ఆశపడి గుర్తు తెలియని వ్యక్తుల నుంచి విత్తనాలు కొనుగోలు చేసి మోసపోవద్దని సూచించారు. కొందరు దళారులు ముఠాలుగా ఏర్పడి తక్కువ ధరలకు విత్తనాలు ఇస్తామని నమ్మబలికి రైతులను మోసం చేస్తున్నారని, అలాంటి వారిపై గ్రామస్థాయిలో కూడా నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
నకిలీ విత్తనాల విక్రయం జరిగిందని తెలిసిన వెంటనే మండల వ్యవసాయ శాఖ అధికారులకు లేదా స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని రైతులకు సూచించారు. మార్కెట్‌లో నకిలీ విత్తనాల విక్రయాలను అరికట్టేందుకు టాస్క్‌ఫోర్స్ బృందాలు నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తాయని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు.



