మిషన్ భగీరథ నీరు వృథా… పట్టించుకోని అధికారులు!
రంగారెడ్డి జిల్లా – ఇబ్రహీంపట్నం నియోజకవర్గం – యాచారం మండలం – మల్కిస్ గూడా గ్రామపంచాయతీ
గత రెండు రోజులుగా మిషన్ భగీరథ పైప్‌లైన్ లీకేజీ కారణంగా లక్షల లీటర్ల తాగునీరు రోడ్డుపై వృథాగా పారిపోతున్నా సంబంధిత అధికారులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గ్రామంలోని ప్రధాన వీధిలో నీరు నిల్వ ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లు బురదమయంగా మారి వాహనదారులు, పాదచారులు ప్రమాదాలకు గురయ్యే పరిస్థితి నెలకొంది. చిన్నపిల్లలు, వృద్ధులు బయటకు రావడానికే భయపడుతున్నారు.
స్థానికులు పలుమార్లు అధికారులకు సమాచారం అందించినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పై గ్రామస్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఒకవైపు తాగునీటి కోసం ప్రజలు ఇబ్బందులు పడుతుంటే… మరోవైపు వేల లీటర్ల నీరు వృథా కావడం బాధాకరం.
వెంటనే స్పందించి లీకేజీని మరమ్మతు చేసి ప్రజలకు ఉపశమనం కల్పించాలని గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.







