అమరుల ఆశయాలు సాధించాలి
తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి
: రాష్ట్ర అధ్యక్షుడు కోరే సాయిరాం
పున్నమి న్యూస్ ప్రతినిధి
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ఇన్చార్జ్ :
యాచారం, మే 20: తెలంగాణ ఉద్యమంలో ప్రాణత్యాగం చేసిన అమరుల ఆశయాలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని అమరుల ఆశయ సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు కోరే సాయిరాం డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమకారులు, అమరుల కుటుంబాలు, కళాకారులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు నేటికీ అమలు కాకపోవడం బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
మారోజు వీరన్న స్తూపం నుండి ప్రజాకవి గద్దర్ సమాధి వరకు చేపట్టిన బస్సు యాత్ర బుధవారం యాచారం మండల కేంద్రానికి చేరుకుంది. ఈ సందర్భంగా మాల్ గ్రామంలో ఏర్పాటు చేసిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం యాచారంలోని తెలంగాణ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ విగ్రహం వద్ద కూడా పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో కోరే సాయిరాం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం కోసం ఎన్నో త్యాగాలు చేసిన ఉద్యమకారులు, కళాకారులు, అమరుల కుటుంబాలు నేటికీ అనేక సమస్యలతో జీవిస్తున్నారని అన్నారు. ప్రభుత్వం వెంటనే వారికి ప్రకటించిన ఆర్థిక సాయం, ఉద్యోగాలు, గౌరవ వేతనాలు మరియు ఇతర సంక్షేమ పథకాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. అమరుల త్యాగాలను మరువకుండా వారి ఆశయ సాధన కోసం ప్రజలంతా ఏకమై పోరాడాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ ఆడబిడ్డల వేదిక రాష్ట్ర అధ్యక్షురాలు వెలుగు వనిత మాట్లాడుతూ తెలంగాణ కోసం పోరాడిన మహిళల సేవలను ప్రభుత్వం గుర్తించాలని కోరారు. రాష్ట్ర కోశాధికారి మల్లోజు శ్రీనివాస చారి మాట్లాడుతూ అమరుల కుటుంబాలకు న్యాయం జరిగే వరకు ఉద్యమం కొనసాగుతుందని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో పల్లె లింగన్న, సంస్కృత సారధి బుల్లెట్ వెంకన్న, తెలంగాణ అమరవీరుల ఆశయాల సాధన సమితి సలహాదారు తిలకమళ్ల లింగయ్య, రాష్ట్ర కోశాధికారి మరియు రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు వరుకుప్పల కాలాస్త్రి, రాష్ట్ర యువజన ప్రధాన కార్యదర్శి బట్టు లింగం తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం మొత్తం తెలంగాణ ఉద్యమ స్పూర్తిని ప్రతిబింబిస్తూ ఉత్సాహభరితంగా సాగింది.



