అక్టోబర్ 21, 2025 – నిర్మల్:
*ధాన్యం కొనుగోళ్లు పగడ్బందీగా చేపట్టాలి:*
*జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్*
జిల్లాలో వరి ధాన్యం కొనుగోళ్లు ఎటువంటి లోటుపాట్లు లేకుండా పగడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు.
మంగళవారం రాత్రి కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, నిర్వహణ తదితర అంశాలపై ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, వరి కోత ప్రారంభమైన నేపథ్యంలో రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగిన సౌకర్యాలతో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సన్న, దొడ్డు రకాల ధాన్యం కోసం వేర్వేరు కేంద్రాలు ఏర్పాటు చేయాలని, సమస్యాత్మక ప్రాంతాలను ముందుగానే గుర్తించి చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. కేంద్రాల్లో తూకపు యంత్రాలు, తేమ యంత్రాలు సక్రమంగా పనిచేస్తున్నాయో లేదో ముందుగా పరిశీలించాలని, ప్రతి వేయింగ్ మిషన్‌కి తప్పనిసరిగా స్టాంపింగ్ చేయాలని ఆదేశించారు. కొనుగోలు కేంద్రాలు గ్రామాల సమీపంలో ఏర్పాటు చేసి రైతులకు సౌకర్యాలు కల్పించాలన్నారు. టార్పలిన్‌లు, గన్ని సంచులు సరిపడా అందుబాటులో ఉంచాలని, లారీలు, కూలీల కొరత తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. రైతుల ఖాతాల్లో చెల్లింపులు జమ చేయడంలో ఏవైనా సాంకేతిక సమస్యలు తలెత్తితే వెంటనే పరిష్కరించాలని తెలిపారు. అవసరమైతే కంట్రోల్ రూమ్ నంబర్ 9182958858ను సంప్రదించవచ్చని తెలిపారు.
కొనుగోలు ఏజెన్సీల సిబ్బందికి తగిన శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని, హార్వెస్టర్లతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి మార్గదర్శకాలు ఇవ్వాలని ఆదేశించారు. రోజువారీగా వరి ధాన్యం కొనుగోలు వివరాలను తమకు అందజేయాలని కలెక్టర్ అధికారులను సూచించారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, పౌర సరఫరాల అధికారి రాజేందర్, జిల్లా మేనేజర్ సుధాకర్, డీఆర్డీవో విజయలక్ష్మి, వ్యవసాయ అధికారి అంజి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.


