*జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్*
తిరుపతి, ఆగస్టు 8 పున్నమి ప్రతినిధి
జిల్లాలో ఆగస్టు 15న నిర్వహించనున్న 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా, క్రమబద్ధంగా, ఎలాంటి లోటుపాట్లు లేకుండా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ ఆదేశించారు.
శనివారం ఉదయం జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్, జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు, జాయింట్ కలెక్టర్ ఆర్. గోవిందరావు, ఇన్‌చార్జి మున్సిపల్ కమిషనర్ శారదాదేవి, జిల్లా రెవెన్యూ అధికారి జి. నరసింహులు, ఇతర జిల్లా అధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై సమీక్షించారు. వివిధ శాఖలకు అప్పగించిన బాధ్యతలు, ఇప్పటివరకు చేపట్టిన ఏర్పాట్లు, ఇంకా చేపట్టాల్సిన కార్యక్రమాలపై సమగ్రంగా చర్చించి అధికారులకు దిశానిర్దేశం చేశారు.
జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు సమయం తక్కువగా ఉన్నందున ప్రతి శాఖకు కేటాయించిన బాధ్యతలను వెంటనే చేపట్టి, నిర్దేశిత గడువులోపు పూర్తి చేయాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రోటోకాల్‌కు అనుగుణంగా అన్ని ఏర్పాట్లు ఉండాలని, కార్యక్రమ నిర్వహణలో ఎటువంటి సమన్వయ లోపం చోటుచేసుకోకుండా అధికారులు ముందస్తు ప్రణాళికతో పనిచేయాలని తెలిపారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి హాజరుకానున్నారని తెలిపారు.
జెండా ఆవిష్కరణ, సెరిమోనియల్ పరేడ్, గార్డ్ ఆఫ్ హానర్, డ్రోన్ పర్యవేక్షణ, ట్రాఫిక్ మేనేజ్‌మెంట్, భద్రతా ఏర్పాట్లు తదితర అంశాలను పోలీస్ శాఖ సమన్వయంతో పకడ్బందీగా పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. తమ తమ శాఖల పరిధిలో నిర్వహించాల్సిన కార్యక్రమాలు, ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేసుకోవాలని ఆదేశించారు.
కార్యక్రమ నిర్వహణలో ఎలాంటి విద్యుత్ అంతరాయం లేకుండా చర్యలు చేపట్టాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. వేదిక ఏర్పాటు, డెకరేషన్, తాగునీరు, పారిశుధ్యం, లైటింగ్, టాయిలెట్లు, ఇతర మౌలిక సదుపాయాల ఏర్పాట్లను పూర్తి చేయాలని మున్సిపల్ అధికారులను సూచించారు.
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో వివిధ ప్రభుత్వ శాఖల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రతిబింబించేలా స్టాళ్లు, శకటాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. పోలీస్, రెవెన్యూ, పరిశ్రమలు, ప్రాథమిక రంగం తదితర ముఖ్య శాఖలకు సంబంధించిన శకటాలు, ప్రదర్శనలు ఏర్పాటు చేయాలని సూచించారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం/ప్రదర్శన నిర్వహించేలా ప్రణాళిక రూపొందించాలని తెలిపారు.
పతాకాలు, ఫ్లాగ్ పోల్స్, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్, ఐటీ సంబంధిత ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖతో సమన్వయం చేసుకుని మీడియా కవరేజ్, సమాచార ప్రసారం, కార్యక్రమ వివరాల అందజేత తదితర ఏర్పాట్లను సక్రమంగా నిర్వహించాలని సూచించారు. కార్యక్రమం అనంతరం ఫొటోగ్రఫీ, సర్టిఫికెట్ల పంపిణీ తదితర అంశాలను కూడా సమన్వయంతో పూర్తి చేయాలని తెలిపారు.
ప్రతి శాఖ తమకు అప్పగించిన బాధ్యతలను అత్యంత బాధ్యతాయుతంగా నిర్వహించి, 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను విజయవంతంగా నిర్వహించేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ స్పష్టం చేశారు.
జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు మాట్లాడుతూ పరేడ్‌లో పాల్గొనే సిబ్బందికి అవసరమైన శిక్షణ, పరేడ్ గ్రౌండ్ సిద్ధం చేయడం, వాహనాల ఏర్పాట్లు, ట్రాఫిక్ నియంత్రణ, డ్రోన్ పర్యవేక్షణ, గార్డ్ ఆఫ్ హానర్ తదితర ఏర్పాట్లు చేపడుతున్నట్లు తెలిపారు. పోలీస్ శాఖకు సంబంధించిన లాజిస్టిక్ ఏర్పాట్లను కూడా గతంలో అనుసరించిన విధానానికి అనుగుణంగా పూర్తి చేస్తామని తెలిపారు. అదనపు ఎస్పీ (ఏఆర్) ఆధ్వర్యంలో సంబంధిత ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ, జిల్లా రెవెన్యూ అధికారితో సమన్వయం చేసుకోవాలని సూచించారు.
ఈ జూమ్ కాన్ఫరెన్స్‌లో ఆర్‌అండ్‌బీ, తుడా, పోలీస్, రెవెన్యూ, మున్సిపల్ కార్పొరేషన్, ఆరోగ్య శాఖ, విద్య, ఫైర్, రవాణా, విద్యుత్, ఐ&పీఆర్ తదితర శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
డి.ఐ.పి.ఆర్.ఓ., తిరుపతి


