భీమిలి : ఆగష్టు 30:
ఇళ్లు ఉన్నాయి… కానీ మౌలిక వసతులు లేవు. వందలాది కుటుంబాలు నివసిస్తున్నా కనీస సౌకర్యాలు కల్పించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. చివరకు ఓ కుటుంబంలో వ్యక్తి మృతి చెందగా, అంత్యక్రియలు నిర్వహించేందుకు స్మశానవాటిక కూడా లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురైన విషాదకర ఘటన పాతపరదేశీపాలెం కొండపేట నూతన కాలనీలో చోటుచేసుకుంది. కొండపేట నూతన కాలనీలో సుమారు 482 గృహాలు ఉన్నాయి. గత ఆరేళ్లుగా ఇక్కడి ప్రజలు మౌలిక వసతుల కోసం అధికారుల చుట్టూ తిరుగుతున్నప్పటికీ సమస్యలు పరిష్కారం కాలేదని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రహదారులు, డ్రైనేజీ, తాగునీరు తదితర సౌకర్యాలతో పాటు కనీసం మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించేందుకు అవసరమైన స్మశానవాటిక కూడా లేకపోవడం దారుణమని వారు అంటున్నారు. ఆదివారం కాలనీలో ఓ వ్యక్తి మృతి చెందడంతో సమస్య తీవ్రత మరోసారి వెలుగులోకి వచ్చింది. అంత్యక్రియలు నిర్వహించేందుకు కాలనీకి సమీపంలోని పాతపరదేశీపాలెం స్మశానవాటికకు మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు కుటుంబ సభ్యులు ప్రయత్నించగా, గ్రామస్తులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో మృతుడి కుటుంబ సభ్యులు ఏం చేయాలో తెలియక తీవ్ర ఆవేదనకు గురయ్యారని కాలనీ కమిటీ సభ్యులు తెలిపారు. చివరకు కాలనీ కమిటీ సభ్యులు, కుటుంబ సభ్యులు చేసేదేమీ లేక మృతదేహాన్ని మృతుడి స్వగ్రామానికి తరలించుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని వారు పేర్కొన్నారు.
482 కుటుంబాలు నివసించే కాలనీలో ఒక వ్యక్తి మరణించినప్పుడు అంత్యక్రియలకు సైతం స్థలం లేకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని శ్రీ శ్రీ శ్రీ గణపతి మహాదేవ సేవా సంఘం సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు ఇళ్లు కల్పించడం మాత్రమే కాకుండా, ఆ కాలనీలో నివసిస్తున్న వారికి అవసరమైన అన్ని మౌలిక వసతులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.
కాలనీ ప్రజల సమస్యలను భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు దృష్టికి తీసుకెళ్లి, అధికారులు వెంటనే కాలనీని పరిశీలించాలని సంఘం సభ్యులు కోరుతున్నారు. 482 కుటుంబాలు ఆరేళ్లుగా ఎదుర్కొంటున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని, ముఖ్యంగా కాలనీకి ప్రత్యేకంగా స్మశానవాటిక ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.
“ఇళ్లు ఇచ్చారు… కానీ జీవించేందుకు అవసరమైన సౌకర్యాలు ఇవ్వలేదు. చివరకు చనిపోయిన వ్యక్తికి అంత్యక్రియలు నిర్వహించేందుకు కూడా స్థలం లేని పరిస్థితి వచ్చింది. ఇకనైనా అధికారులు స్పందించి మా సమస్యలను పరిష్కరించాలి” అని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


