హైదరాబాద్, జూన్
(పువ్వాడ నాగేంద్ర కుమార్
పున్నమి రిపోర్టర్ )
ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణ, ప్రైవేట్ విద్యాసంస్థల ఫీజుల నియంత్రణ, విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం జూన్ 23న రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల బంద్‌కు పిలుపునిస్తున్నట్లు ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి మాచెర్ల రాంబాబు ప్రకటించారు. ఈ మేరకు విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు బంద్‌కు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రైవేట్, కార్పొరేట్ విద్యా మాఫియాకు బ్రాండ్ అంబాసిడర్‌లా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రేషనలైజేషన్ పేరుతో 23 వేల ప్రభుత్వ పాఠశాలలను మూసివేసే కుట్ర జరుగుతోందని విమర్శించారు.
ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలు విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేస్తున్నా ప్రభుత్వం నియంత్రణ చర్యలు తీసుకోవడం లేదని, వారికి రెడ్ కార్పెట్ పరుస్తోందని ఆరోపించారు. విద్యాహక్కు చట్టం (RTE) అమలు అటకెక్కిందని, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు, ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా ఉందన్నారు.
అలాగే కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమైనప్పటికీ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఇప్పటికీ యూనిఫాంలు అందలేదని పేర్కొన్నారు. విద్యారంగ సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని, లేదంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.



