తెలంగాణ రాష్ట్రంలో నిషేధిత భూముల జాబితా 22-ఏలో పట్టా భూములు, ప్రైవేటు భూములను చేర్చి కాంగ్రెస్ ప్రభుత్వం లోని మంత్రులు, అధికారులు అక్రమంగా వేల కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నారని ఖమ్మం జిల్లా బీజేపీ అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు ఆరోపించారు. భూములను కాపాడాల్సిన రెవెన్యూ శాఖ మంత్రే కబ్జాదారుడిగా మారి లక్షల కోట్ల రూపాయల విలువైన భూములను ఆక్రమిస్తున్నారని విమర్శించారు. ఈ వ్యవహారాలన్నింటిపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. జిల్లాలో 22-ఏ జాబితాలో ఉన్న ప్రతి సర్వే నంబర్‌కు సంబంధించిన భూములపై పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని కోరారు. రాష్ట్ర పార్టీ పిలుపులో భాగంగా శనివారం ఖమ్మం కలెక్టర్ కార్యాలయంలో అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ భూ రికార్డుల్లో అవకతవకలు, అక్రమంగా భూములను 22-ఏలో చేర్చిన అంశాలను పరిశీలించి బాధితులకు న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో బీజేపీ పాలేరు ఇంచార్జి నున్నా రవి కుమార్, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు రేఖ సత్య నారాయణ యాదవ్, కిసాన్ మోర్చా అధ్యక్షులు నరకుళ్ళ వెంకటేశ్వరరావు, ఎస్సీ మోర్చా అధ్యక్షులు బండ్ల రిగన్ ప్రతాప్, జిల్లా కార్యదర్శి శ్రీరామనేని మణి, దొడ్డ అరుణ, ఆపతి వెంకట రామారావు, గిరిజన మోర్చా అధ్యక్షులు టి. వీరభద్రం తదితరులు పాల్గొన్నారు.



