అచ్చుతాపురంలో ఘనంగా 119వ జయంతి వేడుకలు.. విగ్రహానికి పూలమాల వేసి నివాళులు
పున్నమి ప్రతినిధి ఆనంద్ ( జిల్లా బ్యూరో)
అచ్చుతాపురం: భగత్‌సింగ్ 119వ జయంతి వేడుకలను CITU ఆధ్వర్యంలో అచ్చుతాపురం కొత్త మోసయ్యపేట గ్రామం వద్ద ఘనంగా నిర్వహించారు. అక్కడి భగత్‌సింగ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా CITU జిల్లా కార్యదర్శి ఆర్. రాము మాట్లాడుతూ.. దేశ స్వాతంత్ర్యం కోసం అతి చిన్న వయసులోనే భగత్‌సింగ్ ప్రాణత్యాగం చేశారని, ఆయన కలలుగన్న దోపిడీ లేని సమాజం కోసం నేటి యువత పోరాడాలని పిలుపునిచ్చారు.
ఉపాధి, విద్య, వైద్యం అందరికీ అందుబాటులో ఉండేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించే విధానాలతో నిరుద్యోగ సమస్య మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ, యువత భవిష్యత్తు కోసం పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిస్తూ యువత ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో కొత్తూరు యూత్ నాయకులు పాము రమణ, కిల్లాడి చిన్న, శెట్టి చిన్న, నాగ, మత్స్యకార కార్మిక సంఘం నాయకులు చేపల తాతయ్య తదితరులు పాల్గొన్నారు.


