హైదరాబాద్లో కల్తీ సోన్పాపిడి తయారీ.. రూ.4 లక్షల సరుకు సీజ్
ఆదిభట్లలో కల్తీ డ్రైఫ్రూట్ తయారీ గుట్టురట్టు
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల పరిధిలో కల్తీ ఆహార పదార్థాల తయారీ గుట్టురట్టైంది. బొంగ్లూర్లోని KSM ఫుడ్ ప్రొడక్ట్స్ సంస్థలో ఆహార భద్రతా అధికారులు తనిఖీలు నిర్వహించగా, గడువు ముగిసిన ముడి సరుకులతో అపరిశుభ్ర వాతావరణంలో సోన్పాపిడి, డ్రైఫ్రూట్ తదితర ఆహార ఉత్పత్తులను తయారు చేస్తున్నట్లు గుర్తించారు.
తనిఖీల్లో సుమారు 3,600 కిలోల గడువు ముగిసిన మైదాతో పాటు మొత్తం రూ.4.07 లక్షల విలువైన ఆహార ఉత్పత్తులు, ముడి సరుకులను అధికారులు స్వాధీనం చేసుకుని సీజ్ చేసినట్లు సమాచారం. ఆహార పదార్థాల తయారీ ప్రాంతంలో పరిశుభ్రతా ప్రమాణాలు పాటించకపోవడం, నాణ్యత లేని ముడి సరుకులను వినియోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
ఈ వ్యవహారానికి సంబంధించి మహ్మద్ ఖలీద్, సంతోష్ కుమార్లను అరెస్ట్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతూ కల్తీ ఆహార పదార్థాలు తయారు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. కల్తీ ఆహార తయారీ, విక్రయాలపై నిరంతరం తనిఖీలు కొనసాగిస్తామని తెలిపారు.



