హైడ్రా కమిషనర్ సంతకం ఫోర్జరీ కలకలం.. ఎనిమిది ప్రైవేట్ జూనియర్ కాలేజీలపై కేసులు నమోదు
ఫైర్ ఎన్‌వోసీల్లో నకిలీ సంతకాల వ్యవహారం వెలుగులోకి.. మరో 60 కాలేజీల పత్రాలపై అధికారులు సమగ్ర పరిశీలన
ప్రైవేట్ జూనియర్ కాలేజీల్లో ఫైర్ సేఫ్టీ నిబంధనల అమలుపై రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపే అంశం వెలుగులోకి వచ్చింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకాన్ని ఫోర్జరీ చేసి ఫైర్ ఎన్వోసీ పత్రాలను రూపొందించి వాటిని ఇంటర్మీడియట్ విద్యా మండలికి సమర్పించిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. సాధారణ ధ్రువపత్రాల పరిశీలనలో భాగంగా ఈ అక్రమం బయటపడినట్లు అధికారులు తెలిపారు.
ఇంటర్మీడియట్ విద్యా మండలికి సమర్పించిన ఫైర్ ఎన్వోసీ పత్రాలను పరిశీలించిన సమయంలో వాటిపై ఉన్న కమిషనర్ సంతకంపై అనుమానం వ్యక్తమైంది. అనంతరం అసలు రికార్డులతో సరిపోల్చి చూడగా సంతకం ఫోర్జరీ జరిగినట్లు అధికారులు గుర్తించినట్లు సమాచారం. దీంతో ఈ వ్యవహారాన్ని అత్యంత తీవ్రంగా పరిగణించిన హైడ్రా అధికారులు సంబంధిత కాలేజీలపై చట్టపరమైన చర్యలకు శ్రీకారం చుట్టారు.
ఈ ఘటనకు సంబంధించి హైడ్రా అడిషనల్ డైరెక్టర్ పోలీసులకు అధికారిక ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా లేక్ పోలీస్ స్టేషన్లో ఎనిమిది ప్రైవేట్ జూనియర్ కాలేజీలపై కేసులు నమోదు చేశారు. బర్కత్‌పురలోని హైందవీ జూనియర్ కాలేజీ, ఎస్ఆర్ నగర్‌లోని రెసోనెన్స్ జూనియర్ కాలేజీ, మెహిదీపట్నంలోని ప్రియాంక జూనియర్ కాలేజీ, విద్యానగర్‌లోని మదర్స్ గర్ల్స్ జూనియర్ కాలేజీ, చంద్రాయణగుట్టలోని శ్రీచైతన్య జూనియర్ కాలేజీ, చిక్కడపల్లిలోని న్యూ ఎరా జూనియర్ కాలేజీ, శివరాంపల్లిలోని షాహీన్ జూనియర్ కాలేజీ, తెల్లాపూర్‌లోని వశిష్ట జూనియర్ కాలేజీలపై క్రిమినల్ కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఈ కాలేజీల గుర్తింపును రద్దు చేయాలని హైడ్రా అధికారులు ఇంటర్మీడియట్ విద్యా మండలికి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. విద్యార్థుల భద్రతకు సంబంధించిన ఫైర్ సేఫ్టీ ధ్రువపత్రాల్లో తప్పుడు సమాచారం సమర్పించడం అత్యంత తీవ్రమైన ఉల్లంఘనగా అధికారులు పేర్కొంటున్నారు. దర్యాప్తులో ఫోర్జరీ నిర్ధారణ అయితే సంబంధిత యాజమాన్యాలపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేస్తున్నారు.
ఇదిలా ఉండగా, ఇదే తరహాలో మరో 60 ప్రైవేట్ జూనియర్ కాలేజీలు సమర్పించిన ఫైర్ ఎన్వోసీ పత్రాలను కూడా అధికారులు స్క్రూటినీ చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రతి పత్రాన్ని అసలు రికార్డులతో సరిపోల్చి పరిశీలిస్తున్నామని, ఎక్కడైనా అక్రమాలు వెలుగులోకి వస్తే ఆయా విద్యాసంస్థలపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.
ఈ ఘటనతో రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఫైర్ సేఫ్టీ అనుమతులు, ధ్రువపత్రాల జారీ విధానం, వాటి ప్రామాణికతపై చర్చ మొదలైంది. విద్యార్థుల భద్రతకు సంబంధించిన అంశాల్లో ఎలాంటి రాజీ ఉండబోదని, నకిలీ పత్రాలు సమర్పించిన వారిపై కఠిన చర్యలు కొనసాగుతాయని అధికారులు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు కొనసాగుతోంది.



