తిరుపతి ఆగస్టు 25 పున్నమి ప్రతినిధి
తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ (ఎస్వీబీసీ) చైర్మన్‌గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన బి. శ్రీధర్ వర్మ సోమవారం ఎస్వీబీసీ కార్యాలయంలో ఉద్యోగులతో ముఖాముఖి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి ఉద్యోగిని వ్యక్తిగతంగా పరిచయం చేసుకుని, వారు నిర్వహిస్తున్న విధులు, బాధ్యతలు, శాఖల పనితీరును అడిగి తెలుసుకున్నారు. ఉద్యోగులు ఎదుర్కొంటు న్న సమస్యలను నేరుగా తన దృష్టికి తీసుకురావాలని సూచిస్తూ, వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం ఎస్వీబీసీ ఛానల్ ప్రసారాలపై సమీక్ష నిర్వహించిన శ్రీధర్ వర్మ, శ్రీవారి మహిమను ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులకు చేరవేయడంలో ఎస్వీబీసీ విశిష్ట సేవలు అందిస్తోందని ప్రశంసించారు. భక్తి, ఆధ్యాత్మికతకు ప్రతీకగా నిలిచిన ఈ ఛానల్ ఇప్పటికే భక్తుల ఆదరణను పొందిందని పేర్కొన్నారు.భవిష్యత్తులో మరింత వినూత్నమైన కార్యక్రమాలతో శ్రీవారి వైభవాన్ని, భారతీయ సనాతన హైందవ ధర్మాన్ని, సంస్కృతి, సంప్రదాయా లను దేశ విదేశాల్లోని భక్తులకు చేరవేసేలా కార్యక్రమాలను రూపొందించాలని అధికారులకు సూచించారు. ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ ఛానల్ ప్రసారాలను మరింత విస్తృతంగా ప్రజలకు చేరేలా చర్యలు చేపడతామని తెలిపారు. ఎస్వీబీసీని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మరింత ఉన్నత స్థానానికి తీసుకెళ్లాలంటే ప్రతి ఉద్యోగి సమష్టిగా కృషి చేయాలని, అంకితభావంతో సేవలందించా లని శ్రీధర్ వర్మ పిలుపునిచ్చారు.



