విశాఖ స్టీల్ ప్లాంట్ లో యంత్రాలు మరమ్మత్తులకు కేంద్ర స్టీల్ మంత్రి గారు ప్రకటించిన ఎనిమిది వేల కోట్ల రూపాయలను తక్షణం విడుదల చేసి స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల,కార్మికుల ప్రాణాలు కాపాడండి అని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్ లు సి హెచ్ నర్సింగరావు, డి ఆదినారాయణ, మంత్రి రాజశేఖర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈరోజు సిటీ జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద 1970 రోజులుగా జరుగుతున్న విశాఖ ఉక్కు పరిరక్షణ ఉద్యమ దీక్షా శిబిరంలో విశాఖ ఉక్కు అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
ఈ ధర్నాకు అధ్యక్షులుగా స్టీల్ సిఐటియు ప్రధాన కార్యదర్శి జె అయోధ్య రామ్ మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ లో యంత్రాల మరమ్మత్తు, కార్మికుల సంఖ్య గణనీయంగా తగ్గుదల వల్ల ఆ ప్రభావం పూర్తిస్థాయి ఉత్పత్తి సాధించడానికి అవరోధంగా ఉందని ఆయన వివరించారు. యంత్రాల మరమ్మత్తు, కార్మికుల సంఖ్య పెంచడం వంటివి ప్రభుత్వ యాజమాన్యాల ఆదేశాలతోనే జరుగుతాయని కనుక ఈ విధమైన చర్యలు తక్షణమే చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.
విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్ లు సి హెచ్ నర్సింగరావు, డి ఆదినారాయణ, మంత్రి రాజశేఖర్ మాట్లాడుతూ ప్రభుత్వం రాజ్యాంగపరంగా కల్పించిన వాక్ స్వాతంత్ర హక్కును నేడు స్టీల్ యాజమాన్యం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అణచివేయాలనుకోవడం అత్యంత దుర్మార్గమని వారు వివరించారు. అందులో భాగంగానే ఆగస్టు 10వ తారీకు మీడియాతో, సామాజిక మాధ్యమాలలో స్టీల్ ప్లాంట్ పై మాట్లాడటం కానీ, ప్రశ్నించిన తగిన చర్యలు తీసుకుంటామని స్టీల్ యాజమాన్యం ఒక సర్కులర్ ను విడుదల చేసిందని వారు అన్నారు. ఇప్పటికే దేశంలో ఎక్కడా లేనివిధంగా ఉత్పత్తి ఆధారంగా పర్సంటేజ్ వేతనాలను కార్మికులకు గడచిన 18 మాసాలుగా చెల్లిస్తున్నారని, హెచ్ ఆర్ ఏ నిలుపుదల చేశారు, కరెంట్ చార్జీలు పెంపు, వి ఆర్ ఎస్ పేరుతో ఉద్యోగులను తొలగించి వారిని ఆర్థికంగా మానసిక ఒత్తిడి గుర్తు చేస్తూ ఇలా తొమ్మిది వందల కోట్ల రూపాయలు బకాయి పడిన యాజమాన్యాన్ని ప్రశ్నించకూడదనడం ఎంతవరకు న్యాయమని వారు అన్నారు. అలాగే కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఉన్న సిఐఎస్ఎఫ్ ద్వారా గడచిన నాలుగు దశాబ్దాలుగా స్టీల్ ప్లాంట్ లో ఆస్తుల రక్షణ మరియు అగ్ని ప్రమాదాల భారీ నుండి యంత్రాలు మరియు కార్మికుల ప్రాణాలను కాపాడుతుంది వారు అన్నారు. ఆ వ్యవస్థను పూర్తిగా తొలగిస్తూ నేడు ఆదేశాలను ఇచ్చారని వారు ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ సంస్థను పూర్తిగా ప్రైవేటు వారికి కట్ట పెట్టాలన్న ప్రభుత్వ ఆలోచనలు ముందడుగు అని వారు వివరించారు. ప్రభుత్వ యాజమాన్యాల వైఖరికి వ్యతిరేకంగా ప్రజలను సమీకరించి పెద్ద ఎత్తున పోరాటాల ద్వారా ప్రతిఘటిస్తామని వారు హెచ్చరించారు.
జిల్లా అఖిలపక్ష కార్మిక సంఘాల ప్రతినిధులు ఆర్ కె వి ఎస్ కుమార్, బి నాగభూషణం, పడాల రమణ, పి వి సురేష్, ఎన్ రామారావు మాట్లాడుతూ ఉత్తరాంధ్ర అభివృద్ధి అంటే స్టీల్ ప్లాంట్ రక్షణ తోనే సాధ్యమవుతుందని వారు వివరించారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రైవేటీకరణ విధానాలను రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం సమర్ధించడం రాష్ట్ర ప్రజల అభిమతానికి విరుద్ధమని వారు అన్నారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి చేసి విశాఖ స్టీల్ ప్లాంట్ ను రక్షించాలని వారు డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో స్టీల్ అఖిలపక్ష కార్మిక సంఘాల ప్రతినిధులు కె ఎం శ్రీనివాస్, రమణమూర్తి, డొక్కా నర్సింగరావు, డివి రమణారెడ్డి, డి సురేష్ బాబు, సి హెచ్ సన్యాసిరావు, జి ఆర్ కె నాయుడు, అట్ట అప్పారావు, స్టీల్ సిఐటియు మాజీ అధ్యక్షులు వై టి దాస్, స్టీల్ ఒబిసి అధ్యక్షులు బి అప్పారావు, స్టీల్ కాంట్రాక్ట్ లేబర్ యూనియన్ సిఐటియు ప్రధాన కార్యదర్శి నమ్మి రమణ, అధ్యక్షులు జి శ్రీనివాస్ వివిధ విభాగాల అధ్యక్ష కార్యదర్శులు మరియు అధిక సంఖ్యలో కార్మికులు, రిటైర్డ్ ఉద్యోగులు, విఆర్ఎస్ కార్మికులు పాల్గొన్నారు.



