విశాఖపట్నం, (పున్నమి ప్రతినిధి): వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో వరుసగా చోటుచేసుకుంటున్న ప్రమాదాల నేపథ్యంలో యాజమాన్యం కఠిన చర్యలకు దిగింది. ప్రమాదాలకు బాధ్యులుగా భావించిన 15 మంది ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు వేయగా, మరో 19 మందిని ఇతర విభాగాలకు బదిలీ చేసినట్లు సమాచారం. ఇటీవల ప్లాంట్‌లో జరిగిన ప్రమాదాలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో యాజమాన్యం ప్రత్యేక దృష్టి సారించింది. ముఖ్యంగా నాసిరకం ముడి పదార్థాల వినియోగం కారణంగానే ప్రమాదాలు జరుగుతున్నాయనే ఆరోపణలపై సమగ్ర విచారణ చేపట్టింది. ఈ తనిఖీల్లో ఆరోపణలకు బలం చేకూరే అంశాలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో స్టీల్ మెల్టింగ్ షాప్-1 (SMS-1)లో ఐదుగురు, స్టీల్ మెల్టింగ్ షాప్-2 (SMS-2)లో ఐదుగురు, రా మెటీరియల్స్ & ఎనర్జీ డిపార్ట్‌మెంట్ (RED)లో మరో ఐదుగురిని సస్పెండ్ చేసినట్లు సమాచారం. అదనంగా 19 మంది సిబ్బందిని ఇతర విభాగాలకు బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల ప్లాంట్‌లో చోటుచేసుకున్న ప్రమాదాల్లో పలువురు కార్మికులు ప్రాణాలు కోల్పోవడం, మరికొందరు తీవ్రంగా గాయపడడం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు దారితీసింది. ఈ నేపథ్యంలో భద్రతా ప్రమాణాల అమలు, ముడి పదార్థాల నాణ్యత, నిర్వహణ వ్యవస్థలపై యాజమాన్యం మరింత కఠినంగా వ్యవహరించనున్నట్లు సంకేతాలు అందుతున్నాయి. ప్రమాదాలపై కొనసాగుతున్న విచారణలో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని, రాబోయే రోజుల్లో మరికొందరిపై కూడా చర్యలు తీసుకునే అవకాశముందని ప్లాంట్ వర్గాలు చెబుతున్నాయి. భద్రతా లోపాల పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని కార్మిక సంఘాలు, ఉద్యోగులు యాజమాన్యాన్ని కోరుతున్నారు.








