విశాఖపట్నం జిల్లా, (పున్నమి ప్రతినిధి) ఆగస్టు 7:: పద్మనాభం: కేజీబీవీ పద్మనాభం విద్యార్థులు తమ వినూత్న ఆలోచనలు, సాంకేతిక నైపుణ్యాలతో మరోసారి ప్రతిభ చాటారు. క్వెస్ట్ అలయన్స్ ఆధ్వర్యంలో రూపొందించిన వినూత్న ప్రాజెక్టులను టాటా ట్రస్ట్ ప్రతినిధులు సందర్శించి పరిశీలించగా, విద్యార్థుల సృజనాత్మకత, సమస్య పరిష్కార సామర్థ్యం, ఆత్మవిశ్వాసాన్ని ప్రశంసించారు.
గీతం యూనివర్సిటీలో నిర్వహించిన క్వెస్ట్ అలయన్స్ పోటీల్లో “వెహికల్ ఓవర్‌లోడ్ డిటెక్టర్” ఉత్తమ ప్రాజెక్ట్‌గా ఎంపిక కావడం పాఠశాలకు గర్వకారణమైంది. ఈ ప్రాజెక్టును అధికారులు ప్రత్యేకంగా పరిశీలించి, విద్యార్థులను అభినందించారు. ప్రాజెక్టుల రూపకల్పన వెనుక ఉన్న ఆలోచనలు, వాటి సామాజిక ఉపయోగాన్ని విద్యార్థులే వివరించడంతో అధికారులు ఆకట్టుకున్నారు.
టాటా ట్రస్ట్ ప్రోగ్రామ్ ఆఫీసర్ శ్రీమతి బాబీ, క్వెస్ట్ అలయన్స్ డైరెక్టర్ శ్రీమతి నేహా పార్థి, స్టేట్ లీడ్ శ్రీ వి.ఎన్.కె.కె. కిషోర్, మేనేజర్ శ్రీ బోనీ జార్జ్, విశాఖపట్నం Amazon Future Skills ప్రోగ్రామ్ ఆఫీసర్ శ్రీమతి రమణి ఈ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడారు. ప్రాజెక్టుల రూపకల్పనలో ఎదురైన సవాళ్లు, వాటిని అధిగమించిన విధానం గురించి తెలుసుకుని వారి ప్రతిభను అభినందించారు.
ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, క్వెస్ట్ అలయన్స్ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో సృజనాత్మకత, విమర్శనాత్మక ఆలోచన, నాయకత్వ లక్షణాలు, సమస్య పరిష్కార సామర్థ్యం, 21వ శతాబ్దపు నైపుణ్యాలు అభివృద్ధి చెందుతున్నాయని పేర్కొన్నారు. ఇటువంటి కార్యక్రమాలు విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన పునాదిని వేస్తాయని తెలిపారు.
పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి కె. గ్రేస్ లిల్లీ మాట్లాడుతూ, విద్యార్థుల నైపుణ్యాభివృద్ధికి తోడ్పడుతున్న టాటా ట్రస్ట్, క్వెస్ట్ అలయన్స్, Amazon Future Skills సంస్థలకు కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులోనూ ఇలాంటి వినూత్న అభ్యాస కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహించి విద్యార్థులను జాతీయ స్థాయిలో నిలబెట్టేందుకు కృషి చేస్తామని చెప్పారు.


