( జయ ప్రతాప్ రెడ్డి నెల్లూరు బ్యూరో)
ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో, ఉప ముఖ్యమంత్రివర్యులు కొణిదల పవన్ కళ్యాణ్ సహకారంతో, విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగ అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మెగా పేరెంట్-టీచర్ మీటింగ్ (Mega PTM 4.0) కార్యక్రమం సీతారామపురం మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం (KGBV) ప్రాంగణంలో యమ్ యల్ ఎ కాకర్ల సురేష్ ఘనంగా నిర్వహించారు.
ముఖ్య అతిథిగా విచ్చేసిన సురేష్ విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు మరియు విద్యార్థులతో కలిసి వేడుకలో పాల్గొన్నారు. కార్యక్రమంలో విద్యార్థుల విద్యా ప్రగతి, హాజరు శాతం, అభ్యాస నైపుణ్యాలు, పాఠశాలల్లో అందుతున్న మౌలిక సదుపాయాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, నాణ్యమైన విద్య అందించడంలో తల్లిదండ్రుల భాగస్వామ్యం వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థను దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దే లక్ష్యంతో విద్యా రంగంలో సమగ్ర సంస్కరణలు చేపడుతోందని తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తు బలోపేతానికి పాఠశాల, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అనే మూడు కీలక వ్యవస్థలు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ఆ దిశగా మెగా పేరెంట్-టీచర్ మీటింగ్ (PTM 4.0) ఎంతో ఉపయోగకరమైన వేదికగా నిలుస్తోందని పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ, విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన ఆర్థిక భరోసా కల్పించే లక్ష్యంతో ‘”తల్లికి వందనం'” పథకాన్ని రెండవ ఏడాదికీ విజయవంతంగా కొనసాగిస్తోందని కాకర్ల సురేష్ తెలిపారు.
ఈ పథకం ద్వారా ఒకే కుటుంబంలో చదువుకుంటున్న పిల్లలు ఎంతమంది ఉన్నా, ప్రతి విద్యార్థికి సంవత్సరానికి రూ.15,000 చొప్పున ఆర్థిక సహాయాన్ని నేరుగా అందజేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 67,47,190 మంది విద్యార్థులకు రూ.10,120 కోట్ల భారీ మొత్తాన్ని ప్రభుత్వం విడుదల చేసి వారి తల్లుల ఖాతాల్లో జమ చేయడం ద్వారా విద్యకు అండగా నిలిచిందన్నారు.
పేద, మధ్యతరగతి కుటుంబాలపై విద్యా ఖర్చుల భారం తగ్గించడంతో పాటు, ప్రతి విద్యార్థి నిరంతరాయంగా చదువును కొనసాగించేలా ఈ పథకం ఎంతో దోహదపడుతోందని ఎమ్మెల్యే గారు అన్నారు. పాఠ్యపుస్తకాలు, యూనిఫారాలు, పాఠశాల ఫీజులు, రవాణా, ఇతర విద్యా అవసరాలకు ఈ ఆర్థిక సహాయం ఎంతో ఉపయోగపడుతుందని, ముఖ్యంగా ఒకే కుటుంబంలో ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలు చదువుతున్న తల్లిదండ్రులకు ఇది గొప్ప ఊరటనిస్తోందని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అత్యున్నత ప్రాధాన్యతనిస్తూ విద్యార్థుల భవిష్యత్తును బలోపేతం చేసే సంక్షేమ కార్యక్రమాలను నిరంతరం అమలు చేస్తోందని ఎమ్మెల్యే గారు పేర్కొన్నారు. ప్రతి విద్యార్థి ఉన్నత విద్యను అభ్యసించి జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలనే లక్ష్యంతో ప్రభుత్వం విద్యారంగంలో ఇటువంటి ప్రజాహిత కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా కొనసాగిస్తోందని ఆయన వివరించారు.
రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో ఒకే రోజు ఈ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించడం రాష్ట్ర ప్రభుత్వం విద్యకు ఇస్తున్న ప్రాధాన్యతకు నిదర్శనమని ఆయన అన్నారు. పిల్లల చదువు, ప్రవర్తన, ప్రతిభ, హాజరు, అభ్యాస సామర్థ్యాలపై ఉపాధ్యాయులు నేరుగా తల్లిదండ్రులతో చర్చించడం ద్వారా విద్యార్థుల అభివృద్ధికి మరింత బలమైన పునాది ఏర్పడుతుందని వివరించారు.
పాఠశాలల అభివృద్ధి కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు, స్థానిక సమాజం అందరూ భాగస్వాములైతేనే విద్యా ప్రమాణాలు మరింత మెరుగుపడతాయని ఎమ్మెల్యే తెలిపారు. మెగా PTM 4.0 కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేసిన తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు మరియు ప్రతి ఒక్కరికీ ఆయన ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.


