హైదరాబాద్ / ఖమ్మం
విద్యార్థుల ఉపకార వేతనాలు విడుదల చేయడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రామచంద్ర రావు చేపట్టిన 48 గంటల నిరాహార దీక్షకు ఖమ్మం జిల్లా బీజేపీ నాయకులు మద్దతు తెలిపారు. జిల్లా బీజేపీ అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు ఆధ్వర్యంలో ఓబీసీ మోర్చా, కిసాన్ మోర్చా, యువ మోర్చా, ఎస్సీ మోర్చా నాయకులు దీక్షా శిబిరానికి తరలివెళ్లారు. ఈ బృందంలో చిలుకూరు రమేష్, నరకుళ్ళ వెంకటేశ్వర రావు, దొడ్డపునేని కృష్ణయ్య, సుబ్బారావు, రేఖ సత్య నారాయణ యాదవ్ పాల్గొన్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం వెంటనే పెండింగ్‌లో ఉన్న ఉపకార వేతనాలను విడుదల చేయాలని నాయకులు డిమాండ్ చేశారు.



