తూర్పుగోదావరి జిల్లా, రాజమహేంద్రవరం,హుకుంపేట (పున్నమి ప్రతినిధి)
వర్షాలు తగ్గి రెండు రోజులు గడిచినా ముంపు సమస్య మాత్రం తొలగకపోవడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షపు నీరు పూర్తిగా బయటకు వెళ్లకపోవడంతో రహదారులు, పరిసర ప్రాంతాల్లో నీరు నిలిచి ఉండటంతో సాధారణ జనజీవనం ఇబ్బందికరంగా మారింది.
వివిధ పనుల నిమిత్తం బయటకు వచ్చే ప్రజలు నిలిచిన నీటిలోనే రాకపోకలు సాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ద్విచక్ర వాహనదారులు, పాదచారులు నీటిలో ప్రయాణించాల్సి రావడంతో ఇబ్బందులు పడుతున్నారు. నీరు ఎక్కువ రోజులు నిలిచి ఉండటంతో రహదారులు దెబ్బతినే పరిస్థితి కూడా ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రోజూ కార్యాలయాలకు విధుల కోసం వచ్చే అధికారులు, సిబ్బందికి కూడా ఇదే సమస్యగా మారింది. కార్యాలయాలకు చేరుకునే సమయంలో ముంపు నీటిని దాటాల్సి వస్తుండటంతో వారు అసౌకర్యానికి గురవుతున్నారు. ముఖ్యంగా వృద్ధులు, మహిళలు, చిన్నపిల్లలు నీటిలో రాకపోకలు సాగించేందుకు ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు చెబుతున్నారు. మరియు విషసర్పాల సంచారంతో భయాందోళన
మరోవైపు చెట్లు, తుప్పలతో నిండిన ఖాళీ స్థలాల నుంచి విషసర్పాలు బయటకు వచ్చి సంచరిస్తుండటంతో స్థానికుల్లో భయాందోళన నెలకొంది. ముంపు నీటితో పాటు పాములు నివాస ప్రాంతాల వైపు వచ్చే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.
నీరు నిలిచి ఉండటంతో దోమలు, ఇతర కీటకాలు పెరిగి పారిశుద్ధ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముంపు నీటిని త్వరగా తొలగించడంతో పాటు పరిసర ప్రాంతాల్లోని చెత్త, తుప్పలు తొలగించి పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.


