పల్నాడు జిల్లా సత్తెనపల్లి: సెప్టెంబర్ 12వ తేదీన నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ ను విజయవంతం చేసేందుకు సత్తెనపల్లి సబ్ డివిజన్ పరిధిలోని పోలీస్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
సత్తెనపల్లి మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశంలో లోక్ అదాలత్ ద్వారా వీలైనంత ఎక్కువ సంఖ్యలో కేసులు రాజీ అయ్యేలా చర్యలు తీసుకోవాలని న్యాయమూర్తులు.. పోలీస్ అధికారులకు సూచించారు.
*సత్తెనపల్లి మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, సత్తెనపల్లి సివిల్ జడ్జి (సీనియర్ డివిజన్) వి. విజయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ…* లోక్ అదాలత్ లతో రాజీకి అవకాశం ఉన్న కేసులను ముందుగానే గుర్తించి, ఇరు వర్గాలతో సమన్వయం చేసుకుని పరిష్కారం అయ్యేలా కృషి చేయాలని కోరారు.
కేసుల పరిష్కారంతో కక్షిదారులకు సమయం, డబ్బు ఆదా కావడంతో పాటు, దీర్ఘకాలంగా కొనసాగుతున్న వివాదాలకు త్వరితగతిన పరిష్కారం లభిస్తుందని తెలిపారు. ముఖ్యంగా ఇరు వర్గాలు పరస్పర అంగీకారంతో పరిష్కరించుకునే కేసులను గుర్తించి, లోక్ అదాలత్ కు తీసుకురావడంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
పోలీస్ అధికారులు కూడా తమ పరిధిలోని కేసులను పరిశీలించి, రాజీ ద్వారా పరిష్కరించుకునే అవకాశం ఉన్న కేసుల వివరాలను న్యాయ సేవాధికార సంస్థకు అందించాలని సూచించారు. పోలీస్ శాఖ, న్యాయ సేవాధికార సంస్థ పరస్పర సమన్వయంతో పనిచేస్తే లోక్ అదాలత్ తో మరిన్ని కేసులు పరిష్కరించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
ఈ సమావేశంలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి దౌసిద్దీన్, రెండవ అదనపు సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) సుజన్ కుమార్ తో పాటు సత్తెనపల్లి సబ్ డివిజన్ పరిధిలోని సీఐలు, ఎస్ఐలు, కోర్టు కానిస్టేబుల్స్ పాల్గొన్నారు.



