అనకాపల్లి జిల్లా( పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్)
ఎలమంచిలి: స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఎలమంచిలి మున్సిపాలిటీ పరిధిలోని రాళ్లచెరువు వద్ద ప్రత్యేక పరిశుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆగస్టు నెల థీమ్ “శానిటేషన్ అండ్ క్లీన్‌లీనెస్ యాక్టివిటీస్”లో భాగంగా మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో చెరువు పరిసరాలను శుభ్రం చేశారు. చెరువు చుట్టూ పేరుకుపోయిన చెత్త, తుప్పలు, పిచ్చి మొక్కలను తొలగించి జంగిల్ క్లియరెన్స్ చేపట్టారు.
ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ ప్రజలు తడి, పొడి చెత్తను వేర్వేరుగా విభజించి పారిశుద్ధ్య కార్మికులకు అందించాలని సూచించారు. రోడ్లు, కాలువల్లో చెత్త వేయకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. స్వచ్ఛ ఎలమంచిలి సాధనకు ప్రజల సహకారం ఎంతో అవసరమన్నారు.
కార్యక్రమంలో శానిటరీ ఇన్‌స్పెక్టర్ పల్లా శ్రీనివాసరావు, మున్సిపల్ మేనేజర్ విజయ్ కుమార్, మెప్మా సిబ్బంది, మున్సిపల్, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.


