ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రాధాన్యతనిస్తూ చేపడుతున్న ఈ పాఠశాల సముదాయ నిర్మాణ పనులను వేగవంతం చేసి, నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ స్పష్టం చేశారు.
శనివారం ఘన్ పూర్ మండలం మైలారం గ్రామంలో నిర్మిస్తున్న యంగ్ ఇండియా మోడల్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణ పనులను తనిఖీ చేశారు. పాఠశాల నిర్మాణ ప్రాంగణంలో జరుగుతున్న నిర్మాణ పనుల పురోగతిని ఇంజనీరింగ్ అధికారులతో కలసి పరిశీలించారు.
నాలుగు అకాడమిక్ బ్లాకులు, సీనియర్, జూనియర్ డార్మిటరీలు, కిచెన్, డైనింగ్ హాళ్లు, అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్‌ల నిర్మాణ ప్రణాళికను కలెక్టర్ పరిశీలించారు. ప్రస్తుతం జరుగుతున్న ఫుటింగ్ లెవెల్, బేస్ కాంక్రీట్ పనులు పరిశీలించారు.
నిర్మాణ పనుల్లో వేగవంతం చేయాలని సూచించారు. నాణ్యతా ప్రమాణాలను పాటించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ నాణ్యత విషయంలో రాజీ పడవద్దని కలెక్టర్ ఆదేశించారు. కాంక్రీట్ గోడల నిర్మాణంలో షియర్ వాల్ టెక్నాలజీని వినియోగించి పనులను నాణ్యంగా పూర్తి చేయాలని ఆదేశించారు.
నిర్మాణ ప్రాంతంలో చెట్లను తొలగించవద్దని, ఒకవేళ తొలగించాల్సి వస్తే తప్పనిసరిగా అటవీ శాఖ అనుమతులు పొందిన తర్వాతే చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
పాఠశాలలో 2,640 మంది విద్యార్థులు, 300 మంది సిబ్బందికి వసతి కల్పించాల్సి ఉందని, అందుకు అవసరమైన నీటి వసతి కల్పించేలా 6 లక్షల లీటర్ల సామర్థ్యం గల అండర్‌గ్రౌండ్ ట్యాంక్, 2 లక్షల లీటర్ల సామర్థ్యం గల ఓవర్‌హెడ్ ట్యాంక్ నిర్మాణాన్ని ప్రణాళికాబద్ధంగా చేపట్టాలని సూచించారు.
విద్యార్థులకు అత్యుత్తమ విద్యా వాతావరణంతో పాటు అవసరమైన మౌలిక వసతులు అందుబాటులో ఉండేలా నిర్మాణ పనులను నాణ్యతతో, వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో టిజిఈడబ్ల్యూఐడిసి ఈఈ అరుణ్ కుమార్, తహసీల్దార్ రాజేశ్వర రావు, ఏఈ జీవన్, సర్పంచ్ సమ్మయ్య నాయక్ తదితరులు పాల్గొన్నారు.


