* పుణ్యక్షేత్రం తిరుపతి పర్యావరణాన్ని యువతే రక్షించుకోవాలి: వక్తలు
తిరుపతి (ఎస్వియు) ఆగస్ట్ 18 పున్నమి ప్రతినిధి
శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయ డైరెక్టరేట్ ఆఫ్ స్టూడెంట్ వెల్ఫేర్ అండ్ కల్చరల్ అఫైర్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రెండురోజుల “సమకాలీన అంశాలపై అవగాహన సదస్సు” మంగళవారం ముగిసింది. కాగా ఈ సదస్సును సోమవారం ఎస్వియు ఉపకులపతి డా. తాత నర్సింగారావు, రిజిస్ట్రార్ ఆచార్య భూపతి నాయుడు లాంచనంగా ప్రారంభించారు. రెండవ రోజు పర్యావరణం పై అవగాహనను పెంపొందించేందుకు “అవగాహనతో పర్యావరణం పరిరక్షణ విద్యార్థుల భాగస్వామ్యం” అనే అంశం పై బెంగళూరు విశ్వవిద్యాలయం ఆచార్యులు నందిని మాట్లాడుతూ వాతావరణ కాలుష్యం పెనుమార్పుల వలన గాలి నాణ్యత తగ్గి ముఖ్య నగరాలైన ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాలలో విపత్కర పరిస్థితులోకి వెళ్లాయన్నారు. ఆ కోరలోకి పోకుండా తిరుపతి లాంటి పవిత్ర పుణ్య క్షేత్రాన్ని కాపాడుకోవడం మన అందరి బాధ్యత విద్యార్థుల పైన భావితరాలపైన ఆధారపడి ఉందన్నారు. విపరీతమైన ప్లాస్టిక్ వాడకం, చెట్లు నిర్మూలన, వాటి సంరక్షణ లేకపోవడం, కాలుష్య ఉద్ధారిత వాహనాలను వాడడం ప్రధాన కారణాలు అన్నారు. సామాజికవేత్త శివాజి పాలేటి జీరో వేస్ట్ ప్లాస్టిక్ పై పుణ్యక్షేత్రాలలో అవగాహన కార్యక్రమాలు, సమూహక చిత్రాలతో చైతన్యం తీసుకువచ్చే కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలిపారు. మలేషియా దేశ టేరంగ్ విశ్వవిద్యాలయం అధ్యాపకులు డా. మన్సూర్ ఇస్మాయిల్ మాట్లాడుతూ పర్యావరణ కాలుష్యం అదుపు చేయాలంటే కాంక్రీట్ జంగిల్లకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని కోరారు. అనంతరం జరిగిన ముగింపు సమావేశంలో సదస్సులో పాల్గొన్న విద్యార్థులకు సర్టిఫికేట్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆచార్య బి.వి. మురళీధర్, కోఆర్డినేటర్స్ డా. పత్తిపాటి వివేక్, కళ్యాణ్, హరీష్, తదితరులు పాల్గొన్నారు.


