మాజీ కార్పొరేటర్ అండదండలతో అక్రమ నిర్మాణమా..!
హయత్‌నగర్‌లో నిబంధనలకు విరుద్ధంగా ఐదంతస్తుల నిర్మాణం..!
బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యుడి బ్రోకరిజంపై ఆరోపణలు.. లక్షల్లో వసూళ్లంటూ స్థానికుల ఆరోపణలు
అధికారులకు వాటాలు వెళ్తున్నాయా..? చోద్యం చూస్తున్న టౌన్‌ప్లానింగ్ అధికారులు!
నిర్మాణాన్ని వెంటనే తనిఖీ చేసి.. అక్రమమైతే సీజ్ చేయాలని స్థానికుల డిమాండ్
ఎల్బీనగర్, సెప్టెంబర్ 7
పున్నమి న్యూస్ : నగరంలో అక్రమ నిర్మాణాలపై వరుసగా విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో హయత్‌నగర్ సర్కిల్–14 పరిధిలో మరో నిర్మాణం చర్చనీయాంశంగా మారింది. హయత్‌నగర్ డివిజన్లోని ప్రధాన జాతీయ రహదారి వెంట కెప్టెన్ కుక్ హోటల్ పక్కనే సెల్లార్‌తో పాటు భారీ భవన నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.
నిర్మాణానికి సంబంధించిన అనుమతులు ఏమిటి..? మంజూరైన ప్లాన్‌కు అనుగుణంగానే నిర్మాణం జరుగుతోందా..? సెల్లార్ నిర్మాణానికి అనుమతి ఉందా..? ప్రస్తుతం కనిపిస్తున్న ఐదంతస్తుల నిర్మాణం పూర్తిగా నిబంధనల పరిధిలోనే ఉందా..? అనే ప్రశ్నలు స్థానికుల్లో వ్యక్తమవుతున్నాయి.
అండదండలు ఎవరివి..?
ఈ నిర్మాణానికి తాజా మాజీ కార్పొరేటర్ అండదండలు ఉన్నాయనే ఆరోపణలు స్థానికంగా వినిపిస్తున్నాయి. అధికారులపై రాజకీయ ఒత్తిడి తెస్తున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. అయితే ఈ ఆరోపణల్లో వాస్తవం ఎంతన్నది అధికారిక విచారణతోనే తేలాల్సి ఉంది.
బ్రోకరిజం.. లక్షల్లో వసూళ్ల ఆరోపణలు
మరోవైపు ఓ బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యుడు మధ్యవర్తిగా వ్యవహరిస్తూ అక్రమ నిర్మాణదారుల నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు స్థానికంగా కలకలం రేపుతున్నాయి. వసూళ్లలో కొంత భాగం అధికారులకు చేరుతుందనే ప్రచారం సైతం జరుగుతున్నప్పటికీ, దీనికి సంబంధించి ఆధారాలు అధికారికంగా బయటకు రావాల్సి ఉంది.
అధికారులు ఎందుకు మౌనం..?
నిర్మాణ పనులు బహిరంగంగా కొనసాగుతున్నప్పటికీ సంబంధిత డిప్యూటీ కమిషనర్, టౌన్‌ప్లానింగ్ అధికారులు ఎందుకు స్పందించడం లేదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నిర్మాణ అనుమతులను పరిశీలించారా..? మంజూరైన ప్లాన్‌కు అనుగుణంగా పనులు జరుగుతున్నాయా..? నిబంధనలు ఉల్లంఘిస్తే ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకున్నారు..? అనే విషయాలపై అధికారులు ప్రజలకు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది.
ఐదంతస్తుల నిర్మాణంపై సమగ్ర తనిఖీ చేయాలి
నిర్మాణం వాస్తవంగా ఎన్ని అంతస్తుల్లో ఉంది, అనుమతుల్లో ఎన్ని అంతస్తులకు అనుమతి ఉంది, సెల్లార్ నిర్మాణం నిబంధనలకు అనుగుణంగా ఉందా, సెట్బ్యాక్లు పాటించారా, పార్కింగ్ నిబంధనలు అమలయ్యాయా వంటి అంశాలపై అధికారులు తక్షణమే స్థల పరిశీలన నిర్వహించాలని స్థానికులు కోరుతున్నారు.
ఇటీవల అక్రమ, నిబంధనలకు విరుద్ధమైన నిర్మాణాల కారణంగా ప్రమాదాలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్మాణంపై అధికారులు నిర్లక్ష్యం చేయకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
అక్రమ నిర్మాణం అంటూ వస్తున్న ఆరోపణలు నిజమైతే వెంటనే పనులను నిలిపివేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, ఆరోపణల్లో వాస్తవం లేకపోతే నిర్మాణానికి సంబంధించిన అనుమతులు, మంజూరైన ప్లాన్ వివరాలను బహిర్గతం చేసి అనుమానాలకు తెరదించాలని ప్రజలు కోరుతున్నారు.



