బిషప్‌ను తొలగించాలని CSI సైనడ్‌కు పాస్టర్ల ఫిర్యాదు
పున్నమి ప్రతినిధి, కడప: రాయలసీమ డయాసిస్ CSI బిషప్ పెయ్యల ఐజాక్ వరప్రసాద్ వ్యవహార శైలిపై పలు తీవ్ర ఆరోపణలు చేస్తూ, ఆయనను బాధ్యతల నుంచి తొలగించి సమగ్ర విచారణ జరపాలని కోరుతూ CSI సైనడ్‌కు ఫిర్యాదు చేసినట్లు సీనియర్ పాస్టర్ రెవరెండ్ ఐక్యత రావు తెలిపారు. ఆరోపణలపై విచారణ పూర్తయ్యే వరకు తమ పోరాటాన్ని కొనసాగిస్తామని పాస్టర్లు స్పష్టం చేశారు.
ఈ నెల 19న చెన్నైలో CSI సైనడ్ మోడరేటర్‌కు సమర్పించిన అప్పీల్‌లో తమ సస్పెన్షన్, మంత్రిత్వ బాధ్యతల నుంచి తొలగింపు, జీతాల నిలిపివేతతో పాటు CSI హైస్కూల్ స్థలాలకు సంబంధించిన లీజులు, భూ వ్యవహారాలు, కోర్టు ఆదేశాలు తదితర అంశాలను ప్రస్తావించినట్లు ఐక్యత రావు తెలిపారు. తమపై తీసుకున్న చర్యల్లో సరైన విధివిధానాలు పాటించలేదని పేర్కొంటూ సైనడ్‌కు వినతిపత్రం సమర్పించినట్లు వెల్లడించారు.
తమ ఫిర్యాదుపై సైనడ్ నుంచి సానుకూల స్పందన లభించిందని, ఆరోపణలపై త్వరలో విచారణ జరిపి బిషప్‌పై తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు పాస్టర్లు తెలిపారు.
CSI హైస్కూల్ గేటుకు తాళం వేయడంపై ఆగ్రహం
శనివారం కడప CSI హైస్కూల్ ప్రాంగణంలో జరుగుతున్న నిర్మాణాలపై పాస్టర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్కూల్ ప్రధాన గేటుకు తాళం వేసి విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, ప్రజల రాకపోకలకు ఆటంకం కలిగించడంతో పాటు, విద్యార్థులకు మధ్యాహ్న భోజనం సరఫరా చేసే వాహనానికి కూడా గేటు తీయకపోవడం దారుణమని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ విషయం తెలుసుకున్న కడప మున్సిపల్ కార్పొరేషన్ అడిషనల్ కమిషనర్ రాకేష్ చంద్ర గేటు వద్దకు చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ప్రైవేట్ వ్యక్తులు పాఠశాల ప్రధాన గేటుకు తాళం వేసి వెళ్లిపోవడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు పాస్టర్లు తెలిపారు.
పాఠశాల ప్రధాన గేటుకు ప్రైవేట్ వ్యక్తులు తాళం వేసే అధికారం ఎవరు ఇచ్చారని ఆయన ప్రశ్నించినట్లు తెలిపారు. ఘటనను పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు సంబంధిత అధికారులకు నివేదిస్తామని అడిషనల్ కమిషనర్ పేర్కొన్నట్లు పాస్టర్లు వెల్లడించారు. విద్యార్థుల రాకపోకలు, మధ్యాహ్న భోజనం సరఫరా వంటి పాఠశాల ప్రాథమిక కార్యకలాపాలకు ఆటంకం కలిగించే చర్యలు దారుణమని ఆయన పేర్కొన్నట్లు తెలిపారు.
‘అవినీతి, అక్రమాల బిషప్ మాకు వద్దు’
గేటు వద్దకు చేరుకున్న పాస్టర్లు బయట నుంచే నిరసన వ్యక్తం చేశారు. “అవినీతి, అక్రమాల బిషప్ మాకు వద్దు” అంటూ బ్యానర్ ప్రదర్శిస్తూ, CSI సైనడ్‌కు సమర్పించిన వినతిపత్రాన్ని మీడియాకు చూపించారు.
CSI హైస్కూల్ ప్రాంగణాన్ని విద్యా ప్రయోజనాలకే పరిమితం చేయాలని, విద్యార్థుల ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా ఎలాంటి వాణిజ్య నిర్మాణాలు చేపట్టకూడదని వారు డిమాండ్ చేశారు.
సర్వే నంబర్లు, రిజిస్ట్రేషన్ వ్యవహారాలపై విచారణకు డిమాండ్
సీనియర్ పాస్టర్ ఐక్యత రావు మాట్లాడుతూ నాగరాజుపల్లి గ్రామ పరిధిలోని సర్వే నంబర్లు 262, 236లోని 1.26 ఎకరాలు, 2.71 ఎకరాల భూములకు సంబంధించి CSI ట్రస్ట్ అనుమతి లేకుండా సబ్‌డివిజన్ కోసం దరఖాస్తు చేసినట్లు ఆరోపించారు. అధికారిక అనుమతులు, అధికార ప్రతినిధిత్వం, సంబంధిత రిజిస్ట్రేషన్ పత్రాల చెల్లుబాటుపై సమగ్ర విచారణ జరపాలని కోరారు.
అలాగే 2023లో డాక్యుమెంట్ నంబర్లు 1242, 1243, 1244, 1245గా పేర్కొన్న మార్ట్గేజ్/సెటిల్‌మెంట్ డీడ్స్, కడప మున్సిపల్ కార్పొరేషన్‌కు సమర్పించినట్లు చెబుతున్న కొన్ని పత్రాలపై కూడా అనుమానాలు ఉన్నాయని తెలిపారు.
సర్వే నంబర్ 236-1లోని Door No.2/19-2-3కు సంబంధించిన పత్రాలు, 2024లో రిజిస్టర్డ్ రెంటల్ డీడ్ నంబర్లు 8179, 8180 ద్వారా జరిగినట్లు పేర్కొంటున్న లావాదేవీలపై కూడా సమగ్ర విచారణ జరపాలని పాస్టర్లు డిమాండ్ చేశారు.
అయితే, ఈ పత్రాల చెల్లుబాటు, భూ విభజన, నిర్మాణ అనుమతులు, రిజిస్ట్రేషన్ వ్యవహారాలపై సంబంధిత రెవెన్యూ, రిజిస్ట్రేషన్, మున్సిపల్ అధికారులు అధికారికంగా విచారణ జరిపి వాస్తవాలను తేల్చాలని కోరారు. భూ రికార్డులు, సబ్‌డివిజన్ అనుమతులు, నిర్మాణ అనుమతులు, రిజిస్ట్రేషన్ పత్రాలు, లీజు ఒప్పందాలను సమగ్రంగా పరిశీలించాలని ప్రభుత్వాన్ని కోరారు.
అనుమతులు చట్టబద్ధంగా లేవని విచారణలో తేలితే వాటిని రద్దు చేసి, అక్రమ నిర్మాణాలపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. CSI ట్రస్ట్ అసోసియేషన్ ఆస్తులకు నష్టం కలిగించేలా ఎవరైనా వ్యవహరించి ఉంటే, సంస్థ నిబంధనల ప్రకారం, అవసరమైతే చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరారు.
బిషప్‌ను తొలగించే వరకు ఉద్యమం
పాస్టర్లు మాట్లాడుతూ, రాయలసీమ డయాసిస్‌లో జరుగుతున్నట్లు తాము ఆరోపిస్తున్న అవినీతి, అక్రమాలు, పరిపాలనా అవకతవకలపై సమగ్ర విచారణ జరగాలని డిమాండ్ చేశారు. CSI సంస్థ ఆస్తులు, విద్యాసంస్థలు, విద్యార్థుల ప్రయోజనాలను కాపాడాలని కోరారు.
“బిషప్‌పై వచ్చిన ఆరోపణలను CSI సైనడ్ స్వతంత్రంగా విచారించి, బాధ్యతల నుంచి తొలగించే వరకు మా ఉద్యమాన్ని కొనసాగిస్తాం. న్యాయం జరిగే వరకు ఉద్యమాన్ని ఆపేది లేదు” అని పాస్టర్లు స్పష్టం చేశారు.
CSI సైనడ్ ఉన్నతాధికారులు వెంటనే కడపకు వచ్చి CSI హైస్కూల్ ప్రాంగణం, సంబంధిత భూమి రికార్డులు, నిర్మాణ అనుమతులు, లీజు ఒప్పందాలు, రిజిస్ట్రేషన్ పత్రాలను ప్రత్యక్షంగా పరిశీలించి, ఆరోపణలపై నిష్పక్షపాత విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు.
విద్యార్థుల భద్రత, పాఠశాల విద్యా వాతావరణం దెబ్బతినకుండా నిర్మాణ పనులపై సంబంధిత అధికారులు తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. స్కూల్ ప్రధాన గేటుకు తాళం వేసి విద్యార్థుల రాకపోకలను, మధ్యాహ్న భోజనం సరఫరాను అడ్డుకునే పరిస్థితి పునరావృతం కాకూడదని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో పాస్టర్లు దేవ సహాయం, మనోరంజన్, మోజస్, వి. ప్రభాకర్, షుబుద్ధిన్, ప్రేమ సాగర్, యన్. ప్రభాకర్, సీపీఐ నగర కార్యదర్శి యన్. వెంకట శివ, కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు, సిఎస్‌ఐ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
– సీనియర్ పాస్టర్ రెవరెండ్ ఐక్యత రావు మరియు పాస్టర్లు



