జగద్గిరిగుట్ట:కుత్బుల్లాపూర్ సర్కిల్ పరిధిలోని పాపిరెడ్డి నగర్ రోడ్ నెం.6 లో 90 గజాల స్థలంలో అనుమతులు లేకుండా 5 అంతస్తుల భవన నిర్మాణం యథేచ్ఛగా సాగుతోంది.
జీహెచ్ఎంసీ నిబంధనల ప్రకారం 100 గజాల లోపు స్థలంలో G+2 వరకు మాత్రమే అనుమతి ఉంటుంది. అది కూడా కచ్చితంగా సెట్ బ్యాక్ వదలాలి. కానీ ఇక్కడ నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి సెట్ బ్యాక్ లేకుండా పక్క ఇళ్లకు ఆనుకుని నిర్మాణం చేపట్టారు.
దీంతో పక్క ఇళ్లకు గాలి, వెలుతురు లేకపోవడం, పార్కింగ్ సమస్యలు తలెత్తుతున్నాయి. భవిష్యత్తులో అగ్ని ప్రమాదాలు జరిగితే పెద్ద ముప్పు తప్పదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇంత జరుగుతున్నా టౌన్ ప్లానింగ్ అధికారులు పట్టించుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వెంటనే జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు స్పందించి అక్రమ నిర్మాణాన్ని నిలిపివేసి, కూల్చివేత చర్యలు చేపట్టాలని కాలనీవాసులు డిమాండ్ చేస్తున్నారు.


