సత్తుపల్లి/ ఖమ్మం.
కైలాస–మానస సరోవర యాత్రకు వెళ్లిన ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలానికి చెందిన సామాజిక కార్యకర్త శ్రీలక్ష్మి రెడ్డితో పాటు ఆమె టీమ్ నేపాల్‌లో సంభవించిన భయంకర బురద ప్రవాహం నుంచి తృటిలో ప్రాణాలతో బయటపడింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో నివాసం ఉంటున్న శ్రీలక్ష్మి రెడ్డి ఈ ఘటనను ప్రత్యక్షంగా వివరించారు.
ఈ నెల 21న టీమ్‌తో కలిసి యాత్రకు బయలుదేరినట్లు తెలిపారు. పర్మిషన్ ఆలస్యం కావడంతో తొలుత కాఠ్మాండూలోని హోటల్‌లో ఉండి, అనుమతి వచ్చిన తర్వాత ప్రయాణం ప్రారంభించామన్నారు. టీమ్ లీడర్స్ వాహనం ముందుగా వెళ్లగా, తాము మరో వాహనంలో వెనుక వస్తున్నామని చెప్పారు.
మార్గమధ్యంలో టీమ్ సభ్యురాలు కల్పన టీ తాగేందుకు అందరినీ బస్సు నుంచి దిగాలని కోరిందన్నారు. తొలుత తాము దిగకపోయినా కల్పన చెప్పడంతో దిగామని, కేవలం పది నిమిషాలు అక్కడ ఆగామని తెలిపారు. అదే సమయంలో ముందుగా వెళ్లిన వాహనాలు భారీ బురద ప్రవాహంలో చిక్కుకుని కొట్టుకుపోయాయని చెప్పారు.
కొండల నుంచి నీరు, మట్టి, బురద ఒక్కసారిగా దూసుకురాగా డ్రైవర్ అప్రమత్తంగా వాహనాన్ని ఆపి సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లారని వివరించారు. తమ బ్యాగులు, బట్టలు, వంట సామగ్రి కొట్టుకుపోయినా టీమ్ సభ్యులంతా క్షేమంగా ఉన్నారని తెలిపారు.
సమీపంలోని మూడు గ్రామాల్లో ఇళ్లు, దుకాణాలు ధ్వంసమై, చిన్నారులు కుటుంబ సభ్యుల కోసం విలపించిన దృశ్యాలు తమను కలచివేశాయని శ్రీలక్ష్మి రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. “ఆ పది నిమిషాలే మా జీవితాల్లో మరపురాని నిమిషాలు. భగవంతుడే మమ్మల్ని కాపాడాడు” అని తెలిపారు.



