ఖమ్మం నగరంలో నేడు వినాయక నిమజ్జన వేడుకలు ఘనంగా జరగనున్నాయి. తొమ్మిది రోజుల పాటు భక్తిశ్రద్ధలతో పూజలు అందుకున్న గణనాథుడికి ‘బై బై గణేష్’ అంటూ భక్తులు వీడ్కోలు పలకనున్నారు. గత 50 ఏళ్లుగా కొనసాగుతున్న గాంధీ చౌక్ వీడ్కోలు వేదికను ఈసారి ముస్తఫా నగర్‌కు మార్చారు. మున్నేరు నదిలో కాకుండా దంసలాపురం చెరువులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిర్వహించనున్న నేపథ్యంలో ఈ మార్పు చేశారు. నిమజ్జన కార్యక్రమంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్, పోలీస్ కమిషనర్ సునీల్ దత్, కార్పొరేషన్ కమిషనర్ అభిషేక్ ఆగస్త్య ఆధ్వర్యంలో అధికారులు విస్తృత ఏర్పాట్లు పూర్తి చేశారు. భక్తుల రాకపోకలు, ట్రాఫిక్ నియంత్రణ, భద్రత, నిమజ్జన ప్రాంతంలో అవసరమైన సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారించారు. దీంతో ఖమ్మం నగరం నేడు గణేష్ నిమజ్జన సందడితో కళకళలాడనుంది. ‘ప్రజలను చల్లగా చూడు గణేషా’ అంటూ భక్తులు గణనాథుడిని గంగమ్మ ఒడికి సాగనంపేందుకు సిద్ధమవుతున్నారు.



