తాళ్లపూడి పున్నమి ప్రతినిధి, జూన్ 30:
తాళ్లపూడి గ్రామానికి చెందిన భారత నౌకాదళ అధికారి లెఫ్టినెంట్ గూడ విహాస్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. మహారాష్ట్ర రాష్ట్రంలోని లోనావాలా సమీపంలో ఉన్న ప్రతిష్ఠాత్మక ఐఎన్‌ఎస్ శివాజీ నౌకాదళ శిక్షణా సంస్థలో నిర్వహించిన మెరైన్ ఇంజనీరింగ్ కోర్సులో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి **”ఓవరాల్ ఆల్‌రౌండ్ ఆఫీసర్”**గా ఎంపికై ప్రతిష్ఠాత్మకమైన “ది హామర్” ట్రోఫీని సీనియర్ నౌకాదళ అధికారి చేతుల మీదుగా అందుకున్నారు.
ఇటీవలే సబ్ లెఫ్టినెంట్ హోదా నుంచి లెఫ్టినెంట్ హోదాకు పదోన్నతి పొందిన విహాస్, శిక్షణ, విద్యా నైపుణ్యం, నాయకత్వ లక్షణాలు, క్రమశిక్షణ తదితర అన్ని విభాగాల్లో అత్యున్నత ప్రతిభను కనబరిచి ఈ విశిష్ట పురస్కారాన్ని అందుకోవడం విశేషం.
తాళ్లపూడి గ్రామానికి చెందిన యువకుడు దేశ రక్షణ రంగంలో ఉన్నత స్థానాన్ని అధిరోహిస్తూ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడం పట్ల గ్రామస్తులు, కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. “మా ఊరి బిడ్డ విహాస్ సాధించిన ఈ విజయం యువతకు ఆదర్శప్రాయమై, దేశసేవ పట్ల మరింత ప్రేరణ కలిగిస్తుంది” అని గ్రామ పెద్దలు అభినందించారు. ఈ సందర్భంగా పలువురు ప్రజాప్రతినిధులు, మిత్రులు, శ్రేయోభిలాషులు లెఫ్టినెంట్ గూడ విహాస్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు.



