తమకు తగిన న్యాయం చేయాలని బాధితుల విజ్ఞప్తి
కడప, పున్నమి ప్రతినిధి: తమ ఇంటి స్థలాన్ని ఆక్రమించడమే కాకుండా భయభ్రాంతులకు గురిచేస్తున్న వారి నుంచి తమను కాపాడి, తమకు న్యాయం చేయాలని బాధితులు మహబూబ్‌చాన్, హజీరా అధికారులను కోరారు. బుధవారం కడప నగరంలోని వైఎస్సార్ మెమోరియల్ ప్రెస్‌క్లబ్‌లో వారు విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ.. తమకు చెందిన స్థలం పక్కనే సుబ్బరాయుడు అనే వ్యక్తి ఐదు సెంట్ల స్థలాన్ని కొనుగోలు చేశారని తెలిపారు. అయితే ప్రస్తుతం పది సెంట్ల స్థలాన్ని కొనుగోలు చేసినట్లు చెబుతూ, పక్కనే ఉన్న రోడ్డును సైతం కలుపుకుని మొత్తం స్థలం తనదేనంటూ తమపై దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
తమకు ఎవరూ పెద్దదిక్కు లేరని తెలుసుకుని కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి భౌతిక దాడులకు పాల్పడుతున్నారని, దీంతో తాము భయాందోళనలతో కాలం వెళ్లదీస్తున్నామని వాపోయారు. రాజకీయ, ఆర్థిక పలుకుబడిని ఉపయోగించుకుని పోలీసుల ద్వారా కూడా తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు.
తమపై అనుచితంగా ప్రవర్తిస్తూ శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురిచేస్తున్నారని తెలిపారు. అలాగే కొందరు ఏఎస్‌ఐలు, కానిస్టేబుళ్లు తరచూ ఫోన్ చేసి ఆధార్‌కార్డు తీసుకురావాలని బెదిరిస్తున్నారని ఆరోపించారు. తాము పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ కనీసం తమను విచారించలేదని, అవతలి వారిని పిలిపించి వివరాలు తెలుసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
అధికారులు స్పందించి స్థలంపై సమగ్ర సర్వే నిర్వహించి సమస్యను పరిష్కరించాలని బాధితులు కోరారు. తమ ప్రాంతంలో రహదారి ఏర్పాటు చేయడంతో పాటు, తమ స్థలం తమకు దక్కేలా చూడాలని, దౌర్జన్యాలకు పాల్పడుతున్న వారి నుంచి తమ ప్రాణాలు, మాన, ఆస్తులను కాపాడాలని వారు విజ్ఞప్తి చేశారు.




