2014కు ముందే నిర్మాణం.. నేటికీ ఒక్కసారి కూడా మరమ్మతులు లేవు
అంగన్‌వాడీ, జెడ్పీహెచ్‌ఎస్, రైతు వేదిక, సఖి సెంటర్‌కు ఇదే ప్రధాన దారి
గుంతలు, పగుళ్లతో ప్రయాణికుల అవస్థలు.. పట్టించుకోని అధికారులు
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా, జనకపూర్:
జనకపూర్ సబ్‌జైల్ ముందు కాలనీలోని అశోక కిరణం దుకాణం నుంచి రైతు వేదిక, అంగన్‌వాడీ కేంద్రం వరకు ఉన్న సీసీ రోడ్డు పూర్తిగా అధ్వానంగా మారింది. 2014 కంటే ముందే నిర్మించిన ఈ రహదారికి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా మరమ్మతులు చేపట్టకపోవడంతో రోడ్డు పలుచోట్ల దెబ్బతిని గుంతలు, పగుళ్లతో దర్శనమిస్తోంది.
ఈ రహదారి మీదుగా నిత్యం అంగన్‌వాడీ కేంద్రానికి బాలింతలు, చిన్నారులు రాకపోకలు సాగిస్తున్నారు. సమీపంలోని జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాలకు వెళ్లే విద్యార్థులు కూడా ఇదే రహదారిని వినియోగిస్తున్నారు. రైతు వేదికలో తరచుగా వీడియో కాన్ఫరెన్స్‌లు, అధికారిక కార్యక్రమాలు, రైతు సమావేశాలు నిర్వహించడంతో అధికారులు, రైతులు, ప్రజల రాకపోకలు అధికంగా ఉంటాయి.
అంతేకాకుండా సఖి సెంటర్‌కు వెళ్లేందుకు కూడా ఇదే రహదారి ప్రధాన మార్గంగా ఉంది. దీంతో ఈ రోడ్డుపై రోజంతా రాకపోకలు కొనసాగుతుంటాయి. ఇంతటి ప్రాధాన్యత కలిగిన రహదారి ఏళ్ల తరబడి మరమ్మతులకు నోచుకోకపోవడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
వర్షాలు కురిసే సమయంలో గుంతల్లో నీరు నిలిచి రహదారి పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతోందని స్థానికులు చెబుతున్నారు. ముఖ్యంగా చిన్నారులు, బాలింతలు, వృద్ధులు, విద్యార్థులు నడిచి వెళ్లేటప్పుడు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ద్విచక్ర వాహనదారులు కూడా గుంతల కారణంగా ప్రమాదాల బారిన పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది.
తక్షణమే మరమ్మతులు చేపట్టాలి
ప్రజలు, విద్యార్థులు, రైతులు, మహిళలు, అధికారులు నిత్యం వినియోగించే ఈ రహదారిని సంబంధిత అధికారులు వెంటనే పరిశీలించాలని స్థానికులు కోరుతున్నారు. రోడ్డు మరమ్మతులకు నిధులు కేటాయించి తక్షణమే పనులు చేపట్టడంతో పాటు, అవసరమైతే నూతన సీసీ రోడ్డు నిర్మించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఏళ్లుగా పట్టించుకోని ఈ రహదారి సమస్యపై అధికారులు ఇకనైనా స్పందించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.



