· పేదల సంక్షేమానికి ఆయన సంస్కరణలు చిరస్మరణీయం: ఉమామహేశ్వర్‌రెడ్డి
తిరుపతి జిల్లా చిట్వేలు మండల కేంద్రంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 17వ వర్ధంతిని ఆయన అభిమానులు, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ చిత్రపటానికి నివాళులర్పించి, ఆయన ప్రజాసేవలను స్మరించుకున్నారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వంటి ప్రజానాయకుడు మరోసారి ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా ఉంటే ఎంతో బాగుండేదని అభిమానులు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా చిట్వేలు మాజీ ఉపసర్పంచ్ ఉమామహేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. వైఎస్సార్ ప్రవేశపెట్టిన పలు సంక్షేమ పథకాలు, సంస్కరణలు నేటికీ ప్రజల జీవితాల్లో ప్రభావం చూపుతున్నాయన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా ఎంతోమంది పేద విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించి ఉద్యోగాల్లో స్థిరపడ్డారని తెలిపారు. ఆరోగ్యశ్రీ, రైతు సంక్షేమ పథకాలు, రుణమాఫీ, 108 అత్యవసర సేవలు వంటి కార్యక్రమాలు పేద, మధ్యతరగతి ప్రజలకు ఎంతో ఉపయోగపడ్డాయని పేర్కొన్నారు. ప్రజల సంక్షేమం కోసం ఆలోచించిన నాయకుడిగా వైఎస్సార్ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని అన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండల సీనియర్ నాయకులు రమణారెడ్డి, లింగం లక్ష్మీకర్, నాగిరెడ్డి, నాగిరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, గులాంబాషా, చిట్వేలు వైఎస్సార్సీపీ యువ నాయకులు నరసింహ, అన్వర్‌బాషా, శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


