ఓబులవారిపల్లి మండలం గొబ్బురవారిపల్లి పంచాయతీలో రైతులకు ఈ-పాస్‌బుక్కుల పంపిణీ కార్యక్రమం గురువారం నిర్వహించారు. తహసీల్దార్ సిద్దేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రైల్వే కోడూరు టీడీపీ ఇన్‌చార్జి ముక్కా రూపానందరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని రైతులకు ఈ-పాస్‌బుక్కులు అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూ హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని, రైతులకు భూములపై పూర్తి స్థాయి హక్కులు కల్పించే దిశగా చర్యలు చేపడుతోందని పేర్కొన్నారు. భూ రికార్డుల నిర్వహణలో పారదర్శకత పెంచేందుకు ఈ-పాస్‌బుక్కులు ఉపయోగపడతాయని అన్నారు.
తహసీల్దార్ సిద్దేశ్వరరావు మాట్లాడుతూ రీ-సర్వే పరిధిలో ఉన్న భూముల రైతులకు కూడా త్వరలోనే ఈ-పాస్‌బుక్కులు అందజేస్తామని తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా భూ వివరాలను సక్రమంగా నమోదు చేస్తున్నామని చెప్పారు.
కార్యక్రమంలో మాజీ ఎంపీపీ తిరుపాలు, ఆర్‌ఐ మల్లికార్జున, రెవెన్యూ సిబ్బంది, ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, రైతులు పాల్గొన్నారు. రైతులు ప్రభుత్వ చర్యలను స్వాగతిస్తూ హర్షం వ్యక్తం చేశారు.



