*పంట పొలాల సంరక్షణే కేత్ బచావో అభియాన్ ముఖ్య ఉద్దేశ్యం*
పున్నమి ప్రతినిధి , తిరుపతి
సాగులో రసాయన ఎరువులు, పురుగుమందుల వినియోగం తగ్గించి పంట పొలాల ఆరోగ్య సంరక్షణ గురించి రైతులకు అవగాహన కల్పించటమే “కేత్ బచావో అభియాన్” ముఖ్య ఉద్దేశ్యం అని రాస్ కృషి విజ్ఞాన కేంద్రం హెడ్ డా.ఎస్.శ్రీనివాసులు తెలిపారు. కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ మరియు భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి, న్యూ డిల్లీ వారి ఆదేశాల మేరకు జూన్ 1 నుండి 30 వరకు నిర్వహిస్తున్న “కేత్ బచావో అభియాన్” కార్యక్రమాన్ని రాస్ కృషి విజ్ఞాన కేంద్రం, తిరుపతి వారు రామచంద్రాపురం మండలం లోని మిట్టూరు గ్రామంలో నిర్వహించారు. కృషి విజ్ఞాన కేంద్రం, తిరుపతి ప్రాంతీయ పరిశోధనా స్థానం, జిల్లా ఏరువాక కేంద్రం నుండి శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖ మరియు జిల్లా వనరుల కేంద్రం అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
కార్యక్రమంలో వ్యవసాయ శాస్త్రవేత్తలు మాట్లాడుతూ వ్యవసాయంలో విచక్షణా రహితంగా రసాయన ఎరువుల వాడకం తగ్గించి భూసార పరీక్ష ఆధారిత సమతుల ఎరువుల వాడకం, ప్రస్తుత ఎల్ నినో పరిస్థితులకు అనుగుణంగా జిల్లాకు అనువైన ప్రత్యామ్నాయ పంటలు, సేంద్రీయ, ప్రకృతి వ్యవసాయ విధానం, జీవన ఎరువుల వాడకం, సూక్ష్మ నీటి పారుదల పద్ధతులు, వ్యవసాయ శాఖ సంక్షేమ పథకాలు, సుస్థిర వ్యవసాయ విధాన పద్ధతుల గురించి రైతులకు అవగాహన కల్పించారు.
వ్యవసాయ శాఖాధికారులు రైతు సేవా కేంద్రం ద్వారా అందిస్తున్న వివిధ సేవలు, రైతు నమోదు సంఖ్య, ఈ పంట నమోదు, ఎరువుల పంపిణీ పత్రం, పంటల సాగులో పచ్చిరొట్ట ఎరువుల ప్రాముఖ్యత గురించి వివరించారు.
కార్యక్రమంలో తరువాత ప్రకృతి వ్యవసాయ విధానంలో భాగమైన విత్తన గుళికల తయారీ గురించి ప్రత్యక్షంగా చేసి చూపించారు.
కృషి విజ్ఞాన కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త మరియు హెడ్ డా.ఎస్ శ్రీనివాసులు, ఏరువాక కేంద్ర సమన్వయకర్త డా. రామకృష్ణా రావు, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డా.ప్రతిమ, కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు రాము కుమార్, అనిల్ కుమార్, జిల్లా వనరుల కేంద్రం వ్యవసాయ శాఖాధికారులు శ్రీ వేణుగోపాల్ రవిప్రసాద్,మండల వ్యవసాయాధికారి మమత, గ్రామ సహాయకులు మరియు మండలంలోని పలు గ్రామాల రైతులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
*డా. ఎస్.శ్రీనివాసులు*
సీనియర్ శాస్త్రవేత్త మరియు హెడ్
రాస్ కృషి విజ్ఞాన కేంద్రం, తిరుపతి



