బస్టాప్ సమీపంలో ప్రమాదకర పరిస్థితి.. పట్టించుకోని అధికారులు!
ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ప్రయాణిస్తున్న గ్రామస్థులు
వాంకిడి, ఆగస్టు 19, (పున్నమి ప్రతినిధి): వాంకిడి మండలం ఖిరిడీ గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారి ప్రమాదాలకు నిలయంగా మారింది. ఖిరిడీ బస్టాప్ సమీపంలోని కల్వర్టు ఒకవైపు పూర్తిగా కుంగిపోవడంతో రహదారి అంచు ప్రమాదకరంగా తయారైంది. ఇటీవల కురిసిన వర్షాలకు కల్వర్టు కింద మట్టి కొట్టుకుపోయి పెద్ద గుంత ఏర్పడటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఖిరిడీ గ్రామానికి రాకపోకలు సాగించే ప్రజలకు ఇదే ప్రధాన మార్గం కావడంతో ప్రతిరోజూ ద్విచక్ర వాహనాలు, ఆటోలు, వ్యవసాయ వాహనాలతో పాటు ఇతర వాహనాలు కూడా ఇదే దారిలో ప్రయాణిస్తున్నాయి. రహదారి అంచు ఎప్పుడు కూలిపోతుందో తెలియని పరిస్థితి నెలకొనడంతో స్థానికుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
వర్షం వస్తే మరింత ప్రమాదం
వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో కల్వర్టు వద్ద కోత మరింత పెరిగే అవకాశం ఉందని గ్రామస్థులు చెబుతున్నారు. ఇప్పటికే రహదారి పక్కభాగం బలహీనపడగా, మరోసారి భారీ వర్షం కురిస్తే రహదారి కొంతభాగం పూర్తిగా తెగిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదే జరిగితే ఖిరిడీ గ్రామానికి రాకపోకలు తీవ్రంగా ప్రభావితమయ్యే అవకాశం ఉంది.
హెచ్చరిక బోర్డులైనా ఏర్పాటు చేయరా?
ప్రమాదకరంగా మారిన ప్రాంతంలో కనీసం హెచ్చరిక బోర్డులు, బ్యారికేడ్లు, రిఫ్లెక్టర్లు ఏర్పాటు చేయకపోవడంపై స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రాత్రివేళ ఈ ప్రాంతం మరింత ప్రమాదకరంగా మారుతోందని, చీకట్లో గుంత కనిపించక ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.
తాత్కాలిక పనులతో ప్రయోజనం లేదంటున్న ప్రజలు
ప్రతి వర్షాకాలంలో కల్వర్టు వద్ద ఇదే సమస్య తలెత్తుతున్నప్పటికీ శాశ్వత పరిష్కారం చూపడం లేదని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. తాత్కాలికంగా మట్టి, కంకర పోసి చేతులు దులుపుకోవడం కాకుండా కల్వర్టును పూర్తిస్థాయిలో పునర్నిర్మించాలని డిమాండ్ చేస్తున్నారు.
అధికారులు స్పందించాలి
ప్రజలు నిత్యం రాకపోకలు సాగించే ప్రధాన మార్గంలో ప్రమాదకర పరిస్థితి నెలకొన్నా సంబంధిత అధికారులు స్పందించకపోవడం పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి ప్రమాద ప్రాంతంలో రక్షణ చర్యలు చేపట్టడంతో పాటు కల్వర్టును శాశ్వతంగా పునర్నిర్మించాలని కోరుతున్నారు.
వర్షాలు మరింత ఉధృతమయ్యేలోపే చర్యలు తీసుకోవాలని, ఏదైనా ప్రమాదం జరిగిన తర్వాత స్పందించడం వల్ల ప్రయోజనం ఉండదని గ్రామస్థులు హెచ్చరిస్తున్నారు.
ప్రమాదం ముంచుకొచ్చేలోపే మరమ్మతులు చేయాలి
ఖిరిడీ బస్టాప్ సమీపంలోని కల్వర్టు దెబ్బతిని ప్రమాదకరంగా మారిందని గ్రామానికి చెందిన వాహనదారుడు బైరాగోని తిరుపతి గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యం వాహనాలు, ప్రయాణికులు రాకపోకలు సాగించే ప్రధాన మార్గంలో కల్వర్టు పరిస్థితి ఆందోళనకరంగా ఉందన్నారు.
అధికారులు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే కల్వర్టును పరిశీలించి మరమ్మతులు చేపట్టాలని కోరారు. చిన్న సమస్యగా భావించి జాప్యం చేస్తే ప్రమాదాలకు అవకాశం ఉంటుందని, ముందస్తుగా చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.





