తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, రేణిగుంట డీఎస్పీ శ్రీ వై. శ్రీనివాసరావు గారి పర్యవేక్షణలో, కోడూరు రూరల్ సీఐ శ్రీ డి. శ్రీనివాసులు, పుల్లంపేట ఎస్‌ఐ శ్రీ వి. చిన్నరెడ్డెప్ప గారి ఆధ్వర్యంలో ఈ ప్రత్యేక నిఘా కొనసాగుతోంది.కోడూరు సర్కిల్ పరిధిలోని పుల్లంపేట మండలం అనంతసముద్రం, వడ్డుపల్లి, అగ్రహారం గ్రామాల్లో డ్రోన్ కెమెరాలను వినియోగించి గ్రామాలు, శివారు ప్రాంతాలు, అనుమానాస్పద ప్రదేశాలపై విస్తృతంగా పర్యవేక్షణ చేపట్టారు.ముఖ్యంగా పేకాట స్థావరాలు, కోళ్ల పందేలు నిర్వహించే ప్రాంతాలు, గంజాయి వినియోగానికి సంబంధించిన అనుమానాస్పద ప్రదేశాలు, బహిరంగంగా మద్యం సేవించే ప్రాంతాలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు.డ్రోన్ నిఘా ద్వారా గుర్తించే అనుమానాస్పద కదలికలు, ప్రదేశాలపై స్థానిక పోలీసు సిబ్బంది తక్షణమే స్పందించేలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.అవసరాన్ని బట్టి కోడూరు సర్కిల్ పరిధిలోని మరిన్ని గ్రామాలకు కూడా డ్రోన్ నిఘాను విస్తరించి, అసాంఘిక కార్యకలాపాలకు పూర్తిస్థాయిలో అడ్డుకట్ట వేసేందుకు నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తామని పోలీసులు స్పష్టం చేశారు.ప్రజలు తమ ప్రాంతాల్లో పేకాట, కోళ్ల పందేలు, గంజాయి వినియోగం, బహిరంగ మద్యం సేవనం వంటి అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు గుర్తిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని, శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.





