తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఆదేశాల మేరకు, రేణిగుంట డీఎస్పీ వై. శ్రీనివాసరావు పర్యవేక్షణలో కోడూరు రూరల్ సర్కిల్ పరిధిలోని పుల్లంపేట, పెనగలూరు, ఓబులవారిపల్లి మండలాల్లో పోలీసులు పాఠశాలలను సందర్శించి విద్యార్థులతో అవగాహన సదస్సులు నిర్వహించారు. పాఠశాలకు వెళ్లి వచ్చే సమయంలో ఈవ్‌టీజింగ్ లేదా ఇతర వేధింపులు ఎదురవుతున్నాయా అనే విషయాలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి సమస్య ఎదురైనా భయపడకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేదా పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.
ఈ సందర్భంగా బాల్యవివాహాలు, గంజాయి, ఇతర మాదకద్రవ్యాల దుష్ప్రభావాలు, పోక్సో చట్టం, గుడ్‌టచ్–బ్యాడ్‌టచ్, సైబర్ నేరాలు, సోషల్ మీడియా వినియోగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, టీనేజ్ ప్రేమ వ్యవహారాలు, తొందరపాటు ప్రేమ వివాహాల వల్ల ఎదురయ్యే సమస్యలపై విద్యార్థులకు వివరించారు. చెడు అలవాట్లకు దూరంగా ఉండి చదువుపై దృష్టి సారించాలని పోలీసులు సూచించారు. విద్యార్థులు తమ సమస్యలను పోలీసుల దృష్టికి తీసుకొస్తే అవసరమైన సహాయం అందిస్తామని తెలిపారు.





