తిరుపతి కలెక్టరేట్, ఆగస్టు 25 పున్నమి ప్రతినిధి
రాష్ట్రంలో కళారంగ అభివృద్ధికి ప్రత్యేక కళా-సాంస్కృతిక విధానాన్ని రూపొందించి, జానపద, గ్రామీణ కళాకారుల సంక్షేమానికి ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్యమండలి డిమాండ్ చేసింది. కళాకారుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు రాష్ట్రవ్యాప్తంగా చేపడుతున్న కార్యక్రమంలో భాగంగా మంగళవారం తిరుపతి కలెక్టరేట్ వద్ద ‘ఆట-పాట-మాట’ కార్యక్రమాన్ని నిర్వహించారు. అరసం రాష్ట్ర బాధ్యులు పి.హరినాథ్‌రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్యమండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిన్నం పెంచలయ్య, సీపీఐ తిరుపతి జిల్లా కార్యదర్శి పి.మురళి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కలెక్టరేట్ వద్ద కళాకారులు ఆటపాటలతో ప్రదర్శన నిర్వహించగా, పోలీసులు సైతం ఆసక్తిగా తిలకించారు. అనంతరం ప్రజానాట్యమండలి నాయకులు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్‌ను కలిసి తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా పి.హరినాథ్‌రెడ్డి మాట్లాడుతూ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, సినిమా, టీవీ మాధ్యమాల విస్తరణతో గ్రామీణ జానపద కళలు క్రమంగా కనుమరుగవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకప్పుడు కుల, మతాలకు అతీతంగా ఆటపాటల ద్వారా ప్రజల్లో ఐక్యతను పెంపొందించిన జానపద కళలకు ప్రస్తుతం ఆదరణ తగ్గిందన్నారు. జానపద, గ్రామీణ, కోలాట, భజన బృందాల కళాకారులకు నంది నాటకోత్సవాల్లో అవకాశాలు కల్పించాలని కోరారు. టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమాల్లో కళాకారులందరికీ సమాన అవకాశాలు కల్పించేలా రోస్టర్ విధానం అమలు చేయాలని, గ్రామీణ ప్రాంతాల్లో నిర్మిస్తున్న ఆలయాలకు అనుబంధంగా కళా కేంద్రాలు, కళాకారుల ప్రదర్శనలకు షెడ్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. వృద్ధ కళాకారులకు పెన్షన్లు, పేద కళాకారులకు ఇంటి స్థలాలు, తెల్ల రేషన్ కార్డులు మంజూరు చేయాలని కోరారు.
చిన్నం పెంచలయ్య మాట్లాడుతూ ఆట-పాట-మాట ద్వారా ప్రజలను చైతన్యవంతం చేస్తున్న కళాకారులకు ప్రభుత్వం గుర్తింపు కార్డులు మంజూరు చేయాలని కోరారు. తోలుబొమ్మలాట, బుర్రకథ, హరికథ, భాగవతం వంటి సంప్రదాయ కళారూపాలకు ఆదరణ తగ్గిపోతోందని అన్నారు. ప్రతి పేద కళాకారుడికి ఇంటి స్థలం మంజూరు చేసి కళాకారుల కాలనీలు నిర్మించాలని, 50 ఏళ్లు నిండిన ప్రతి కళాకారుడికి నెలకు రూ.10 వేల పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రతి మండల కేంద్రంలో మినీ ఆడిటోరియంలు నిర్మించాలని, రాష్ట్రంలో సమగ్ర కళా-సాంస్కృతిక విధానాన్ని రూపొందించాలని కోరారు. కళారంగ అభివృద్ధికి ప్రతి ఏడాది బడ్జెట్లో రూ.500 కోట్లు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే మండలాల వారీగా ఉద్యమాలను విస్తరిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నగర కార్యదర్శి జె.విశ్వనాథ్, ప్రజానాట్యమండలి రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్.గుర్రప్ప, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కె.చారులత, జె.నాగరాజు, సి.నారాయణదాసు, బి.నదియా, ఎన్.మంజుల తదితరులు పాల్గొన్నారు.






