ఖమ్మం, జూలై
(పున్నమి న్యూస్)
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో ఎరువుల ధరల పెరుగుదల, అక్రమ వసూళ్లు రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. డీఏపీ (DAP) ఎరువు బస్తాపై ముద్రించిన గరిష్ఠ చిల్లర ధర (MRP) కంటే సుమారు రూ.200 అధికంగా వసూలు చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.
అలాగే 20-20 ఎరువును రూ.1,500కు విక్రయించాల్సి ఉండగా రూ.2,200 వరకు విక్రయిస్తున్నారని, ఇతర ఎరువులు కొనుగోలు చేసిన వారికే యూరియా ఇస్తామంటూ కొందరు డీలర్లు షరతులు విధిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ అక్రమాలపై వ్యవసాయ శాఖ అధికారులు తక్షణమే తనిఖీలు నిర్వహించి, అధిక ధరలకు ఎరువులు విక్రయిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
ఈ ఖరీఫ్ సీజన్‌లో ఖమ్మం జిల్లాలో 5,96,662 ఎకరాలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 6,09,250 ఎకరాల్లో పంటలు సాగు చేయనున్నట్లు వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఇలాంటి పరిస్థితుల్లో రైతులకు సకాలంలో, నిర్ణీత ధరలకు ఎరువులు అందుబాటులో ఉంచాలని రైతు సంఘాలు కోరుతున్నాయి.



