భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా పట్టణ అభివృద్ధి ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశాలు
ఆత్మకూరు (హరికిరణ్, పున్నమి ప్రతినిధి):
రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి, ఆత్మకూరు నియోజకవర్గ శాసనసభ్యులు ఆనం రామనారాయణరెడ్డి ఆత్మకూరు పట్టణ సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా సరికొత్త మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నామని తెలిపారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా అన్ని రంగాల్లో పట్టణాన్ని అభివృద్ధి చేసే దిశగా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు.
బుధవారం నెల్లూరులోని తన క్యాంపు కార్యాలయంలో ఆత్మకూరు మున్సిపాలిటీ మాస్టర్ ప్లాన్‌పై నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, ఆత్మకూరు మున్సిపల్ కమిషనర్, పట్టణాభివృద్ధి మరియు ఇతర సంబంధిత శాఖల అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆత్మకూరు పట్టణ ప్రస్తుత పరిస్థితులు, భవిష్యత్ విస్తరణ, జనాభా పెరుగుదల, ట్రాఫిక్ సమస్యలు, మౌలిక వసతుల అవసరాలపై విస్తృతంగా చర్చించారు.
ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మాట్లాడుతూ.. ఆత్మకూరు పట్టణాన్ని ఆధునిక పట్టణంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. పెరుగుతున్న జనాభా అవసరాలను దృష్టిలో ఉంచుకొని రహదారుల విస్తరణ, అంతర్గత రోడ్ల కనెక్టివిటీ మెరుగుదల, సీసీ రోడ్ల నిర్మాణం, ఆధునిక డ్రెయినేజ్ వ్యవస్థ, స్వచ్ఛమైన తాగునీటి సరఫరా వంటి అంశాలకు మాస్టర్ ప్లాన్‌లో ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు సూచించారు.

పట్టణంలో ట్రాఫిక్ సమస్యలను ముందుగానే అంచనా వేసి, దీర్ఘకాలిక ప్రణాళికతో రోడ్ల అభివృద్ధి చేపట్టాలని స్పష్టం చేశారు. ప్రధాన రహదారులతో పాటు కాలనీల్లోని అంతర్గత రహదారులు కూడా మెరుగుపడేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పట్టణంలోని ప్రతి వార్డు సమానంగా అభివృద్ధి చెందేలా అవసరాల ఆధారంగా ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు.
ప్రజలకు మెరుగైన పౌరసేవలు అందించడమే లక్ష్యంగా పనిచేయాలని, పారిశుధ్యం, తాగునీరు, రోడ్లు, డ్రెయినేజీ, వీధి దీపాలు వంటి మౌలిక సదుపాయాల విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదన్నారు. భవిష్యత్ తరాలకు ఉపయోగపడే విధంగా శాశ్వత అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు.
అలాగే పట్టణ విస్తరణను దృష్టిలో ఉంచుకొని కొత్త కాలనీలు, వాణిజ్య ప్రాంతాలు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రజా అవసరాలకు సంబంధించిన మౌలిక వసతులను సమన్వయంతో అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. అభివృద్ధి ప్రణాళికల్లో ప్రజల అభిప్రాయాలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
ఆత్మకూరును అభివృద్ధి చెందిన ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి స్పష్టం చేశారు. సమగ్ర మాస్టర్ ప్లాన్ ద్వారా పట్టణానికి దీర్ఘకాలిక ప్రయోజనం కలిగేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఈ సమీక్ష సమావేశంలో నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి,ఆత్మకూరు ఆర్దిఒ మరియు మున్సిపాలిటీ స్పెషల్ ఆఫీసర్ పావని , ఆత్మకూరు మున్సిపల్ కమిషనర్ గంగ ప్రసాద్ , టిడిపి పట్టణ అధ్యక్షులు తుమ్మల చంద్రారెడ్డి మరియు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


