ఆత్మకూరు, జూన్ 15 (హరికిరణ్, పున్నమి ప్రతినిధి):
ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ (ఏపీటీఎఫ్) ఆత్మకూరు మండల శాఖ ఆధ్వర్యంలో సోమవారం మండల పరిధిలోని అన్ని ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. 2026-2027 విద్యా సంవత్సరానికి సంబంధించి ఉపాధ్యాయులను సంఘంలో భాగస్వామ్యం చేసే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.
ఈ సందర్భంగా ఏపీటీఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్ ఆర్. వెంకటేశ్వర్లు రెడ్డి మాట్లాడుతూ ఆత్మకూరు మండలంలోని అన్ని పాఠశాలల్లో రెండు బృందాలుగా ఏర్పడి ఉపాధ్యాయులను కలిసి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ఏపీటీఎఫ్ చేపడుతున్న కార్యక్రమాలు, ఉపాధ్యాయుల సమస్యలపై సంఘం చేస్తున్న పోరాటాలను గుర్తించి మండలంలోని ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో సభ్యత్వం స్వీకరించారని అన్నారు.
ప్రస్తుతం ఉపాధ్యాయుల్లో టెట్ (టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్)పై ఆందోళన నెలకొని ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే ఉపాధ్యాయుల్లో ఉన్న భయాందోళనలు తొలగించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రత్యేక టెట్ నిర్వహించి పాస్ మార్కులను 35 శాతంగా నిర్ణయించాలని డిమాండ్ చేశారు. అలాగే ఉపాధ్యాయులు బోధించే తరగతులకు సంబంధించిన సిలబస్, సబ్జెక్టుల ఆధారంగానే పరీక్ష విధానం ఉండాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు సురేంద్ర రెడ్డి మాట్లాడుతూ నూతన ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయినా ఉపాధ్యాయులకు సంబంధించిన వేల కోట్ల రూపాయల పెండింగ్ బకాయిలు చెల్లించకపోవడం బాధాకరమని అన్నారు. ప్రభుత్వం వెంటనే పీఆర్సీ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.ఉద్యోగులకు 30 శాతం మధ్యంతర భృతి ప్రకటించాలని, పెండింగ్‌లో ఉన్న నాలుగు విడతల కరువు భత్యాన్ని విడుదల చేయాలని, ఇతర అన్ని బకాయిలను వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు. సమస్యలను పరిష్కరించకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఏపీటీఎఫ్ జిల్లా బాధ్యులు రామసుబ్బారెడ్డి, మల్లికార్జున రెడ్డి, సురేష్, శివకుమార్, మండల శాఖ అధ్యక్షుడు వెంగయ్య, బాధ్యులు దయాకర్, తిరుపతిరెడ్డి, ఐ. శ్రీనివాసులు రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


