తాళ్లపూడి, పున్నమి ప్రతినిధి మే 6:
తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి మండలంలోని అన్నదేవరపేట గ్రామంలో సుమారు వందేళ్ల చరిత్ర కలిగిన పురాతన శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం పునర్నిర్మాణానికి ఈ నెల 11న సోమవారం ముహూర్తం ఖరారైంది. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి ఆహ్వానిస్తూ గ్రామ ప్రముఖులు అల్లూరి విక్రమాదిత్య ఆధ్వర్యంలో రాజమండ్రి ఎంపీ దగ్గుపాటి పురందేశ్వరి, రూడా చైర్మన్ మరియు జిల్లా టీడీపీ అధ్యక్షుడు బొడ్డు అనంత వెంకటరమణ చౌదరికి ఆహ్వాన పత్రాలు అందజేశారు.
ఆహ్వానాన్ని స్వీకరించిన ఎంపీ పురందేశ్వరి, ఆధ్యాత్మిక భావంతో చేపడుతున్న ఈ పునర్నిర్మాణానికి తప్పకుండా హాజరవుతానని హామీ ఇచ్చారు. రాష్ట్రానికి శ్రీరాముడి ఆశీస్సులు మెండుగా ఉన్నాయని ఆమె పేర్కొన్నారు.
వందేళ్ల నాటి ఈ ఆలయ శంకుస్థాపన కార్యక్రమాన్ని గ్రామంలో పండుగ వాతావరణంలో వైభవంగా నిర్వహించేందుకు నిర్వాహకులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ముళ్ళపూడి శ్రీరామచంద్రమూర్తి, డాక్టర్ పసుపులేటి దత్తాత్రేయులు, పెదపాటి కృష్ణమోహన్, అర్చకులు పెద్దింటి భార్గవ, డాక్టర్ రవికుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


