Saturday, 12 July 2025
  • Home  
  • విద్యాలయాలు

విద్యాలయాలు విద్యావేత్తలను, వైద్యులను, ఇంజనీర్లను, శాస్త్రజ్ఞులను, న్యాయ వాదులను, న్యాయమూర్తులను, దేశరక్షకులను, నాయకులను అందించి సకల మానవాళిని వున్నత భావిపౌరులుగా తీర్చిదిద్దే కర్మాగారాల వంటి స్థలాలే విద్యాలయాలు. తొలి విద్యాలయాలు వి.ఆర్‌. కళాశాల విద్యారంగంలో జిల్లా ముందడుగులో వుంది. ప్రధమంగా నెల్లూరులో సి.ఏ.యం. హైస్కూలు, వెంకటగిరి రాజా హైస్కూలు, వేద సంస్కృత పాఠశాల ప్రారంభించబడినవి. వీటిని ఈ ప్రాంతపు మొదటి విద్యాలయాలుగా పేర్కొనాలి. 1875లో సుంకు నారాయణస్వామి శెట్టి అద్దె ఇంటిలో ప్రారంభించిన హిందూ వర్నాకులర్‌ స్కూలు క్రమంగా హిందూ హైస్కూలుగా పిలువబడేది. 1979లో మహమ్మదు రహంతుల్లా సాహెబ్‌ (వెంకటగిరి రాజాగారి మాజీ దివాను) భవన స్థలాన్ని కొనుగోలు చేసి పాఠశాలకు విరాళమిచ్చారు. వెంకటగిరి రాజా రాజగోపాలకృష్ణ యాచేంద్ర దాతృత్వంతో అభివృద్ధి పరచడంవల్ల 1895లో హిందూ హైస్కూలు పేరు వెంకటగిరి రాజా హైస్కూలుగా మార్చారు. పాఠశాల నిరంతరాయంగా కొనసాగడానికి అవసరమైన భవనాలు నిర్మించారు. 50 వేల రూపాయలు శాశ్వతనిధి సమకూర్చారు. ఆనాడు వి.ఆర్‌. హైస్కూలుగా మొదలై 1920లో వి.ఆర్‌ కళాశాల, క్రమంగా పోస్టు గ్రాడ్యుయేషన్‌, లా కాలేజి, చిల్డ్రన్స్‌ అకాడమీ, ఈవినింగ్‌ కాలేజి, అడ్వాన్స్‌డ్‌ స్టడీస్‌తో నేడు విరాజిల్లుతోంది. కళాశాల సర్వతోముఖాభివృద్ధికి ఆనం కుటుంబీకులు, మేనకూరు ఆదిశేషారెడ్డి, మాడభూషి నరసింహాచారి, వవ్వేటి విశ్వనాథరావు, తూములూరు శివరామయ్య విశేష కృషి చేశారు. ఈ ప్రాంతపు మేధావులు, ప్రముఖులలో ఎక్కువమంది ఇందులో చదివినవారు కావడం విశేషం. వి.ఆర్‌. కళాశాల మొదటి ప్రిన్సి పాల్‌గా రాయసం వెంకట శివుడు పనిచేశారు. సిఎఎం హైస్కూల్‌ : మిషనరీస్‌ ఆధ్వర్యంలో 1837 ప్రాంతాలలో ఏర్ప డిన సి.ఏ.యం. హైస్కూలు విద్యావ్యాప్తికి బాగా తోడ్ప డింది. ఇది నెల్లూరులో స్థాపితమైన మొదటి హైస్కూలు. ప్రప్రథమంగా ఆంగ్లవిద్యను ప్రవేశ పెట్టింది. విశాలమైన ప్రాంగణంలో మంచి భవనాలు నిర్మించారు. ఆటస్థలం ఏర్పాటు చేశారు. క్రమశిక్షణకు మారుపేరుగా వుండేది. దీటైన ఉపాధ్యాయులు ఇందులో పనిచేశారు. అంతటి వున్నత స్థితిలో వుండిన పాఠశాల 175 ఏళ్ళ తర్వాత మూతపడింది. ఆస్తులు పరాధీనమవుతున్నాయి. వేదసంస్కృత పాఠశాల స్థానికంగా వున్న భాషాభిమానుల ప్రోత్సాహంతో 1882లో స్థాపించబడింది. పిల్లలకు సంస్కృతంపై పరిజ్ఞానం, పట్టు, వేద విజ్ఞానాన్ని పెంపొందించడం ప్రధాన వుద్దేశం. వేదాలను, మన సంస్కృతిని మరిచిపోతున్న ఈ రోజుల్లో సాంప్రదాయబద్ధంగా విద్యాలయం సాగుతుంది. చిన్న పాఠశాలగా మొదలై కళాశాలగా రూపుదిద్దుకొంది. వేదం, సంస్కృతం, ఇతిహాసాలు, కావ్యాలు ఇక్కడ విద్యార్థులకు బోధిస్తారు. ఇక్కడ చదివినవారు విద్వాన్‌, శిరోమణి వంటి విద్యార్హతలు పొందగలిగారు. తెలుగు, సంస్కృత పండితులుగా గౌరవప్రదమైన ఉద్యోగాలు సంపాదించి స్థిరపడ్డారు. పురాతన గ్రంథాలు, శాస్త్రాలు, ఇతిహాసాలు కలిగిన పెద్ద గ్రంథాలయం వుంది. 1900-1915 మధ్య కాలంలో వెంకటగిరిలో ఆర్‌.వి.యం. హైస్కూలు, నెల్లూరులో ఎబియం గరల్స్‌ హైస్కూలు, కావలిలో బోర్డు హైస్కూలు ప్రారంభమయ్యాయి. కావలిలో విశ్వోదయ విద్యాసంస్థలు జవహరు భారతి : ఈ విద్యాలయ సంస్థలకు శ్రీకారం చుట్టిన మహ నీయుడు ‘డి.ఆర్‌.’గా పిలువ బడే దొడ్ల రామచంద్రారెడ్డి. కావలిలో సంపన్నమైన సంస్కా రవంతమైన కుటుంబంలో పుట్టి చిన్న వయస్సులోనే ఎం.ఎ డిగ్రీ పొందిన తర్వాత ఆయనకు కళాశాల స్థాపన ఆలోచన కలి గింది. 1951లో విశ్వోదయ విద్యా సంస్థను స్థాపించారు. కొంతకాలం తర్వాత జవహర్‌ భారతి కాలేజీగా నామకరణం చేశారు. 1953లో డిగ్రీ కళశాల, 1972లో పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ సెంటర్‌, 1978లో ఇంజనీరింగ్‌ కాలేజి స్థాపించారు. ‘తమసోమా జ్యోతిర్గమయ’ అంటే చీకటిని పారద్రోలి వెలుగులోకి రావడం, అజ్ఞానం నుండి విజ్ఞానంలోకి రావడం అనే భావనతో ప్రారంభమైంది. విద్యారంగంలో వెనుకబడిన కావలి ప్రాంతానికి, ప్రకాశంజిల్లా మెట్ట ప్రాంతాలవారికి విద్యా సముపార్జనకు అవకాశాలు కలుగజేశారు. అప్పటి ఉమ్మడి మద్రాసు రాష్ట్ర ప్రభుత్వం 200 ఎకరాల స్థలం కేటాయించింది. విశ్వోదయ సంస్థ పేరుకు తగ్గట్టే ఆశయాలు, వాటికి తగ్గట్టే సంస్థ ఎంబ్లమ్‌ రూపొందించారు. దొడ్ల రామచంద్రారెడ్డికి వెన్నుదన్నుగా ఛీఫ్‌ జస్టిస్‌ రాజమన్నార్‌, తిక్కవరపు రామిరెడ్డి, రామానుజ రావు నాయుడు, బెజవాడ రామచంద్రారెడ్డి, బెజవాడ గోపాలరెడ్డి, మల్లికార్జునం, భుజంగ రాయ శర్మ వంటి మేధావులున్నారు. ఈ విద్యా సంస్థలో ఎందరో ప్రముఖులు విద్య నభ్యసిం చారు. సి.పి.యం. కార్యదర్శి రాఘవులు, సుప్రీంకోర్టు న్యాయమూర్తి వెంకట్రామి రెడ్డి, దివంగత ఐ.ఏ.యస్‌. అధికారి సుబ్రహ్మణ్యం, జూపూడి ప్రభాకరరావు, ఆదాల ప్రభాకరరెడ్డి, వంటేరు వేణుగోపాలరెడ్డి, కంభం విజయరామిరెడ్డి వంటి ప్రముఖులు ఇక్కడ చదువుకున్న వారే. విద్యా సంస్థలకు డి.ఆర్‌.గారు రెక్టారుగా వ్యవహరించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం వీరికి గౌరవ డాక్టరేట్‌ ఇచ్చింది. నీలం సంజీవరెడ్డి, జలగం వెంగళరావు, కామరాజ నాడార్‌, దేశ్‌ముఖ్‌ దంపతులు, జాకీర్‌ హుసేన్‌ వంటి మహామహులు ఈ విద్యా సంస్థలను సందర్శించారు. విద్యా సంస్థలు 60 సం|| పూర్తి చేసుకొన్న సందర్భంలో 2012లో వజ్రోత్సవం జరుపుకొంది. నేదురుమల్లి బాలకృష్ణారెడ్డి విద్యాసంస్థలు : స్వాతంత్య్రం రాకపూర్వమే విద్యాలయాలను, హాస్టళ్ళను ప్రారం భించి పాతికేళ్లపాటు అవిరళ కృషిచేసిన మహోన్నతుడు. నెల్లూరు జిల్లాలో విద్యా సంస్థ లకు కోట, వాకాడు మండ లాలు ప్రసిద్ధి చెందాయి. అప్పట్లో ఈ రెండు మండ లాలు కోట సమితిగా వుండేది. విద్యాదాతగా పేరుపొందిన బాలకృష్ణారెడ్డి గారి కృషివల్ల విద్యాసంస్థలు వెలిశాయి. వీరు నేదురు మల్లి జనార్ధనరెడ్డికి పినతండ్రి గారు. 1965లో కళాశాల స్థాపించారు. క్రమంగా వాటితో ఈ మండలాలకు విద్వత్‌ వెలుగులు వచ్చాయి. వీటి అభివృద్ధికి నేదురుమల్లి, నల్లపరెడ్లు సయోధ్యగా కృషి చేశారు. వాకాడు మండలం విడిపోయిన తర్వాత నల్లపురెడ్డి శ్రీనివాసుల రెడ్డి 1988లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్‌.టి. రామారావు చేతులమీదుగా కోటలో జూనియర్‌ మహిళా కళాశాలను స్థాపించారు. బాలకృష్ణారెడ్డి మరణించిన తర్వాత జనార్దన రెడ్డి, పద్మనాభరెడ్డి సోదరులు బాధ్యత వహించి విద్యాలయాలను అభివృద్ధి చేశారు. వాకాడు విద్యానగర్‌గా మారిపోయింది. బాలకృష్ణారెడ్డి హరిజన పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ వహించేవారు. వారి అభివృద్ధికి సంఘాలను ఏర్పాటు చేశారు. ఈ సంస్థలను ఇందిరాగాంధీ ఒకసారి దర్శించారు. విద్యానగర్‌లో బాలురకు, బాలికలకు ప్రత్యేక హాస్టళ్ళు నిర్మించారు. ఇక్కడ చదువుకొన్న విద్యార్థులు గొప్ప పదవులలో వున్నారు. ఈ విద్యా సంస్థలు చదువులోనే కాకుండా క్రమశిక్షణకు పేరుపడ్డాయి. వీటికి ఆద్యుడు, స్థాపకుడు, మూలపురుషుడు అనతగిన నేదురుమల్లి బాలకృష్ణారెడ్డి చిరస్మరణీయుడు. వీరి సేవలు గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం ‘దీన బంధు’ బిరుదుతో, కేంద్రం పద్మశ్రీ అవార్డుతో సత్కరించాయి. ఆ మహనీయుడు 1978లో కన్నుమూసినా వారు వెలిగించిన విద్యాజ్యోతి దేదీప్యమానంగా వెలుగుతూనే వుంది. శ్రీ సర్వోదయ కళాశాల : 1972లో నెల్లూరులోని వైశ్య ప్రముఖులు కళాశాలను ప్రారంభించారు. వాకాటి సంజీవిశెట్టి ముఖ్యదాతగా సి.సి. సుబ్బరాయుడు తదితరులతో కలిసి ప్రారంభించారు. యడ్లపల్లి గోవిందుశెట్టి, వొమ్మిన సుబ్రహ్మణ్యం సెక్రటరీలుగా పనిచేశారు. ఆర్‌.టి.సి. బస్టాండు ప్రాంతంలో ఏడెకరాల స్థలంలో కాలేజి నిర్మితమైంది. ఇక్కడ ఇంటర్మీడియట్‌, బి.ఏ., బి.యస్‌సి., ఎం.ఏ., ఎం.కామ్‌., తదితర చదువులున్నాయి. డా|| వి. మాధవరావు, డా|| కాళిదాసు పురుషోత్తం వంటి మేధావులు ఇక్కడ ప్రిన్సిపాల్స్‌గా పనిచేశారు. నిపుణులైన అధ్యాపకులు ఆయాశాఖలలో పనిచేస్తున్నారు. కాలేజి 1996లో ఎండోమెంట్స్‌ శాఖ పరిధిలోకి వెళ్లింది. కోరా విద్యా సంస్థలు : నెల్లూరుకు చెందిన విద్యావేత్త కోదండ రామయ్య ఆధ్వర్యంలో 1986లో విద్యాలయాలు స్థాపించబడినవి. ఎంసెట్‌ పోటీ పరీక్షలకు విద్యార్థులకు శిక్షణ ఇచ్చే సంస్థగా ప్రారంభమై 1995లో జూనియర్‌ కాలేజిగా రూపుదిద్దుకొంది. ఇటీవల స్వర్గస్తులైన డాక్టరు ఎస్‌.వి.నరసింహులు (రిటైర్డ్‌ ప్రిన్సిపాల్‌ డి.కె.డబ్ల్యూ. కాలేజి) వంటి ప్రముఖ విద్యావేత్తలు సంస్థకు మూలస్థంబాలలో ఒకరుగా వుండేవారు. 2000 మార్చిలో ఈ సంస్థ రత్నం విద్యాసంస్థలలో విలీనమయింది. నారాయణ విద్యా సంస్థలు : ప్రైవేటు విద్యా సంస్థల స్థాపనలో నారాయణ పేరు, నారాయణ విద్యా సంస్థల పేర్లు విననివారు రాష్ట్రంలో వుండరు. 1977లో పి. నారాయణ ఒక కాలేజీలో స్టాటిస్టిక్స్‌ లెక్చరర్‌గా జీవితాన్ని ప్రారంభించారు. ఎందు కనో ఆయన అందులో కొనసాగ లేదు. కొనసాగి వుంటే ఆయనలోని ప్రజ్ఞ, ప్రతిభా పాటవాలు బయల్పడేవి కావు. 1983 నుండి విద్యాసంస్థలను ఒకటొకటిగా ప్రారంభించడం మొదలు పెట్టారు. నెల్లూరు సమీపంలోని చింతారెడ్డిపాళెం విద్యలకు కేంద్ర బిందువయింది. అక్కడనుండి విద్యాలయాలు విస్తరించాయి. క్రమంగా జిల్లా, రాష్ట్ర పరిధులు దాటింది. నేడు దేశంలో పలుచోట్ల నారాయణ విద్యాసంస్థలు (దాదాపు 300) నెలకొని వున్నాయి. ఇందులో ఐదారువేల మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. సుమారు 3 లక్షల మంది విద్యార్థులు చదువుకొంటున్నారు. ఆయన స్వతంత్రంగా, స్వయంకృషితో ఎదిగారు. పట్టుదల, కార్యదీక్ష, మృదుస్వభావం ఆయన సహజ లక్షణాలు. ప్రస్తుతం నారాయణ సంస్థలలో ప్రీప్రైమరీ స్కూలునుండి పోస్టు గ్రాడ్యుయేట్‌ వరకు విద్యాలయాలున్నాయి. ఒలింపియాడ్‌ స్కూల్స్‌, కాన్సెప్ట్‌ స్కూల్స్‌, టెక్నో స్కూల్స్‌, జూనియర్‌ కాలేజీలు, మెడికల్‌ కాలేజీ, డెంటల్‌ కాలేజీ, ఇంజనీరింగ్‌ కాలేజి, బి.ఫార్మసి, స్కూల్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంటు, యోగ & నేచురోపతి కాలేజి, బి.ఇడి. కాలేజి వున్నాయి. విద్యార్థులకు శిక్షణ ఇవ్వడానికి ఇటీవల ఐ.ఎ.ఎస్‌. అకాడమి ప్రారంభించారు. 30 సం||ల కాలంలో (1983-2012) నారాయణ విద్యాసంస్థలు అగ్రగామిగా నిలిచాయి. ఇప్పటి వరకు రాజకీయాలకు దూరంగా వున్న నారాయణ 2014 జూన్‌లో తెలుగుదేశం ప్రభుత్వంలో మంత్రి అయ్యారు. రత్నం విద్యా సంస్థలు : నెల్లూరు జిల్లాలో 1984లో ప్రారంభమైన రత్నం సంస్థలకు ప్రత్యేక స్థానం వుంది. కె.వి. రత్నం, వారి శ్రీమతి పద్మావతి రత్నం సంస్థ వ్యవస్థాపకులుగా వున్నారు. ప్రస్తుతం కె. వేణుగోపాల్‌ , డా|| కె. కృష్ణకిషోర్‌ సారధ్యంలో నడుస్తున్నాయి. రత్నం రెసిడెన్షియల్‌ స్కూలు, ఫార్మసి ఇన్‌స్టిట్యూట్‌, కంప్యూ టర్‌ సైన్సెస్‌ ఇన్‌స్టిట్యూట్లు నెల్లూరు సమీపంలోని పిడతా పోలూరులో, రత్నం పబ్లిక్‌ స్కూలు ధనలక్ష్మీపురంలో నిర్మించారు. రత్నం డిగ్రీ కళాశాలను హరనాథ పురంలో స్థాపించారు. నెల్లూరు నగర పరిధిలో రత్నం ఒలింపియాడ్‌ అకాడమి క్యాంపస్‌ స్కూలు దర్గామిట్టలో, గ్లోబల్‌ స్కూలు మాగుంట లే అవుట్‌లో స్థాపించారు. వ్యాపార దృష్టితో కాకుండా విద్యాసంస్థలను ఎంతగానో అభివృద్ధి చేశారు. ప్రియదర్శిని విద్యాసంస్థలు : నెల్లూరు జిల్లా, సూళ్ళూరుపేటలో 2001-02 సం||లో ఇంజనీరింగ్‌ కాలేజి ప్రారంభించారు. 2005-06లో నెల్లూరు పట్టణ పరిధిలో మరొక ఇంజనీరింగ్‌ కాలేజీ స్థాపించారు. ఇక్కడ యం.సి.ఏ., యం.బి.ఏ. కోర్సులు కూడ వున్నాయి. సూళ్ళూరుపేటలో ఇంజ నీరింగ్‌ కోర్సులోని పలు బ్రాంచీలను ఏర్పాటు చేశారు.

విద్యాలయాలు
విద్యావేత్తలను, వైద్యులను, ఇంజనీర్లను, శాస్త్రజ్ఞులను, న్యాయ వాదులను, న్యాయమూర్తులను, దేశరక్షకులను, నాయకులను అందించి సకల మానవాళిని వున్నత భావిపౌరులుగా తీర్చిదిద్దే కర్మాగారాల వంటి స్థలాలే విద్యాలయాలు.
తొలి విద్యాలయాలు
వి.ఆర్‌. కళాశాల
విద్యారంగంలో జిల్లా ముందడుగులో వుంది. ప్రధమంగా నెల్లూరులో సి.ఏ.యం. హైస్కూలు, వెంకటగిరి రాజా హైస్కూలు, వేద సంస్కృత పాఠశాల ప్రారంభించబడినవి. వీటిని ఈ ప్రాంతపు మొదటి విద్యాలయాలుగా పేర్కొనాలి. 1875లో సుంకు నారాయణస్వామి శెట్టి అద్దె ఇంటిలో ప్రారంభించిన హిందూ వర్నాకులర్‌ స్కూలు క్రమంగా హిందూ హైస్కూలుగా పిలువబడేది. 1979లో మహమ్మదు రహంతుల్లా సాహెబ్‌ (వెంకటగిరి రాజాగారి మాజీ దివాను) భవన స్థలాన్ని కొనుగోలు చేసి పాఠశాలకు విరాళమిచ్చారు. వెంకటగిరి రాజా రాజగోపాలకృష్ణ యాచేంద్ర దాతృత్వంతో అభివృద్ధి పరచడంవల్ల 1895లో హిందూ హైస్కూలు పేరు వెంకటగిరి రాజా హైస్కూలుగా మార్చారు.
పాఠశాల నిరంతరాయంగా కొనసాగడానికి అవసరమైన భవనాలు నిర్మించారు. 50 వేల రూపాయలు శాశ్వతనిధి సమకూర్చారు. ఆనాడు వి.ఆర్‌. హైస్కూలుగా మొదలై 1920లో వి.ఆర్‌ కళాశాల, క్రమంగా పోస్టు గ్రాడ్యుయేషన్‌, లా కాలేజి, చిల్డ్రన్స్‌ అకాడమీ, ఈవినింగ్‌ కాలేజి, అడ్వాన్స్‌డ్‌ స్టడీస్‌తో నేడు విరాజిల్లుతోంది. కళాశాల సర్వతోముఖాభివృద్ధికి ఆనం కుటుంబీకులు, మేనకూరు ఆదిశేషారెడ్డి, మాడభూషి నరసింహాచారి, వవ్వేటి విశ్వనాథరావు, తూములూరు శివరామయ్య విశేష కృషి చేశారు. ఈ ప్రాంతపు మేధావులు, ప్రముఖులలో ఎక్కువమంది ఇందులో చదివినవారు కావడం విశేషం. వి.ఆర్‌. కళాశాల మొదటి ప్రిన్సి పాల్‌గా రాయసం వెంకట శివుడు పనిచేశారు.
సిఎఎం హైస్కూల్‌ :
మిషనరీస్‌ ఆధ్వర్యంలో 1837 ప్రాంతాలలో ఏర్ప డిన సి.ఏ.యం. హైస్కూలు విద్యావ్యాప్తికి బాగా తోడ్ప డింది. ఇది నెల్లూరులో స్థాపితమైన మొదటి హైస్కూలు. ప్రప్రథమంగా ఆంగ్లవిద్యను ప్రవేశ పెట్టింది. విశాలమైన ప్రాంగణంలో మంచి భవనాలు నిర్మించారు. ఆటస్థలం ఏర్పాటు చేశారు. క్రమశిక్షణకు మారుపేరుగా వుండేది. దీటైన ఉపాధ్యాయులు ఇందులో పనిచేశారు. అంతటి వున్నత స్థితిలో వుండిన పాఠశాల 175 ఏళ్ళ తర్వాత మూతపడింది. ఆస్తులు పరాధీనమవుతున్నాయి.
వేదసంస్కృత పాఠశాల స్థానికంగా వున్న భాషాభిమానుల ప్రోత్సాహంతో 1882లో స్థాపించబడింది. పిల్లలకు సంస్కృతంపై పరిజ్ఞానం, పట్టు, వేద విజ్ఞానాన్ని పెంపొందించడం ప్రధాన వుద్దేశం. వేదాలను, మన సంస్కృతిని మరిచిపోతున్న ఈ రోజుల్లో సాంప్రదాయబద్ధంగా విద్యాలయం సాగుతుంది. చిన్న పాఠశాలగా మొదలై కళాశాలగా రూపుదిద్దుకొంది. వేదం, సంస్కృతం, ఇతిహాసాలు, కావ్యాలు ఇక్కడ విద్యార్థులకు బోధిస్తారు. ఇక్కడ చదివినవారు విద్వాన్‌, శిరోమణి వంటి విద్యార్హతలు పొందగలిగారు. తెలుగు, సంస్కృత పండితులుగా గౌరవప్రదమైన ఉద్యోగాలు సంపాదించి స్థిరపడ్డారు. పురాతన గ్రంథాలు, శాస్త్రాలు, ఇతిహాసాలు కలిగిన పెద్ద గ్రంథాలయం వుంది. 1900-1915 మధ్య కాలంలో వెంకటగిరిలో ఆర్‌.వి.యం. హైస్కూలు, నెల్లూరులో ఎబియం గరల్స్‌ హైస్కూలు, కావలిలో బోర్డు హైస్కూలు ప్రారంభమయ్యాయి.
కావలిలో విశ్వోదయ విద్యాసంస్థలు
జవహరు భారతి : ఈ విద్యాలయ సంస్థలకు శ్రీకారం చుట్టిన మహ నీయుడు ‘డి.ఆర్‌.’గా పిలువ బడే దొడ్ల రామచంద్రారెడ్డి. కావలిలో సంపన్నమైన సంస్కా రవంతమైన కుటుంబంలో పుట్టి చిన్న వయస్సులోనే ఎం.ఎ డిగ్రీ పొందిన తర్వాత ఆయనకు కళాశాల స్థాపన ఆలోచన కలి గింది. 1951లో విశ్వోదయ విద్యా సంస్థను స్థాపించారు. కొంతకాలం తర్వాత జవహర్‌ భారతి కాలేజీగా నామకరణం చేశారు. 1953లో డిగ్రీ కళశాల, 1972లో పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ సెంటర్‌, 1978లో ఇంజనీరింగ్‌ కాలేజి స్థాపించారు.
‘తమసోమా జ్యోతిర్గమయ’ అంటే చీకటిని పారద్రోలి వెలుగులోకి రావడం, అజ్ఞానం నుండి విజ్ఞానంలోకి రావడం అనే భావనతో ప్రారంభమైంది. విద్యారంగంలో వెనుకబడిన కావలి ప్రాంతానికి, ప్రకాశంజిల్లా మెట్ట ప్రాంతాలవారికి విద్యా సముపార్జనకు అవకాశాలు కలుగజేశారు. అప్పటి ఉమ్మడి మద్రాసు రాష్ట్ర ప్రభుత్వం 200 ఎకరాల స్థలం కేటాయించింది. విశ్వోదయ సంస్థ పేరుకు తగ్గట్టే ఆశయాలు, వాటికి తగ్గట్టే సంస్థ ఎంబ్లమ్‌ రూపొందించారు. దొడ్ల రామచంద్రారెడ్డికి వెన్నుదన్నుగా ఛీఫ్‌ జస్టిస్‌ రాజమన్నార్‌, తిక్కవరపు రామిరెడ్డి, రామానుజ రావు నాయుడు, బెజవాడ రామచంద్రారెడ్డి, బెజవాడ గోపాలరెడ్డి, మల్లికార్జునం, భుజంగ రాయ శర్మ వంటి మేధావులున్నారు. ఈ విద్యా సంస్థలో ఎందరో ప్రముఖులు విద్య నభ్యసిం చారు. సి.పి.యం. కార్యదర్శి రాఘవులు, సుప్రీంకోర్టు న్యాయమూర్తి వెంకట్రామి రెడ్డి, దివంగత ఐ.ఏ.యస్‌. అధికారి సుబ్రహ్మణ్యం, జూపూడి ప్రభాకరరావు, ఆదాల ప్రభాకరరెడ్డి, వంటేరు వేణుగోపాలరెడ్డి, కంభం విజయరామిరెడ్డి వంటి ప్రముఖులు ఇక్కడ చదువుకున్న వారే. విద్యా సంస్థలకు డి.ఆర్‌.గారు రెక్టారుగా వ్యవహరించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం వీరికి గౌరవ డాక్టరేట్‌ ఇచ్చింది. నీలం సంజీవరెడ్డి, జలగం వెంగళరావు, కామరాజ నాడార్‌, దేశ్‌ముఖ్‌ దంపతులు, జాకీర్‌ హుసేన్‌ వంటి మహామహులు ఈ విద్యా సంస్థలను సందర్శించారు. విద్యా సంస్థలు 60 సం|| పూర్తి చేసుకొన్న సందర్భంలో 2012లో వజ్రోత్సవం జరుపుకొంది.
నేదురుమల్లి బాలకృష్ణారెడ్డి విద్యాసంస్థలు : స్వాతంత్య్రం రాకపూర్వమే విద్యాలయాలను, హాస్టళ్ళను ప్రారం భించి పాతికేళ్లపాటు అవిరళ కృషిచేసిన మహోన్నతుడు. నెల్లూరు జిల్లాలో విద్యా సంస్థ లకు కోట, వాకాడు మండ లాలు ప్రసిద్ధి చెందాయి. అప్పట్లో ఈ రెండు మండ లాలు కోట సమితిగా వుండేది. విద్యాదాతగా పేరుపొందిన బాలకృష్ణారెడ్డి గారి కృషివల్ల విద్యాసంస్థలు వెలిశాయి. వీరు నేదురు మల్లి జనార్ధనరెడ్డికి పినతండ్రి గారు. 1965లో కళాశాల స్థాపించారు. క్రమంగా వాటితో ఈ మండలాలకు విద్వత్‌ వెలుగులు వచ్చాయి. వీటి అభివృద్ధికి నేదురుమల్లి, నల్లపరెడ్లు సయోధ్యగా కృషి చేశారు. వాకాడు మండలం విడిపోయిన తర్వాత నల్లపురెడ్డి శ్రీనివాసుల రెడ్డి 1988లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్‌.టి. రామారావు చేతులమీదుగా కోటలో జూనియర్‌ మహిళా కళాశాలను స్థాపించారు. బాలకృష్ణారెడ్డి మరణించిన తర్వాత జనార్దన రెడ్డి, పద్మనాభరెడ్డి సోదరులు బాధ్యత వహించి విద్యాలయాలను అభివృద్ధి చేశారు. వాకాడు విద్యానగర్‌గా మారిపోయింది. బాలకృష్ణారెడ్డి హరిజన పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ వహించేవారు. వారి అభివృద్ధికి సంఘాలను ఏర్పాటు చేశారు. ఈ సంస్థలను ఇందిరాగాంధీ ఒకసారి దర్శించారు.
విద్యానగర్‌లో బాలురకు, బాలికలకు ప్రత్యేక హాస్టళ్ళు నిర్మించారు. ఇక్కడ చదువుకొన్న విద్యార్థులు గొప్ప పదవులలో వున్నారు. ఈ విద్యా సంస్థలు చదువులోనే కాకుండా క్రమశిక్షణకు పేరుపడ్డాయి. వీటికి ఆద్యుడు, స్థాపకుడు, మూలపురుషుడు అనతగిన నేదురుమల్లి బాలకృష్ణారెడ్డి చిరస్మరణీయుడు.
వీరి సేవలు గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం ‘దీన బంధు’ బిరుదుతో, కేంద్రం పద్మశ్రీ అవార్డుతో సత్కరించాయి. ఆ మహనీయుడు 1978లో కన్నుమూసినా వారు వెలిగించిన విద్యాజ్యోతి దేదీప్యమానంగా వెలుగుతూనే వుంది.
శ్రీ సర్వోదయ కళాశాల : 1972లో నెల్లూరులోని వైశ్య ప్రముఖులు కళాశాలను ప్రారంభించారు. వాకాటి సంజీవిశెట్టి ముఖ్యదాతగా సి.సి. సుబ్బరాయుడు తదితరులతో కలిసి ప్రారంభించారు. యడ్లపల్లి గోవిందుశెట్టి, వొమ్మిన సుబ్రహ్మణ్యం సెక్రటరీలుగా పనిచేశారు. ఆర్‌.టి.సి. బస్టాండు ప్రాంతంలో ఏడెకరాల స్థలంలో కాలేజి నిర్మితమైంది. ఇక్కడ ఇంటర్మీడియట్‌, బి.ఏ., బి.యస్‌సి., ఎం.ఏ., ఎం.కామ్‌., తదితర చదువులున్నాయి. డా|| వి. మాధవరావు, డా|| కాళిదాసు పురుషోత్తం వంటి మేధావులు ఇక్కడ ప్రిన్సిపాల్స్‌గా పనిచేశారు. నిపుణులైన అధ్యాపకులు ఆయాశాఖలలో పనిచేస్తున్నారు. కాలేజి 1996లో ఎండోమెంట్స్‌ శాఖ పరిధిలోకి వెళ్లింది.
కోరా విద్యా సంస్థలు : నెల్లూరుకు చెందిన విద్యావేత్త కోదండ రామయ్య ఆధ్వర్యంలో 1986లో విద్యాలయాలు స్థాపించబడినవి. ఎంసెట్‌ పోటీ పరీక్షలకు విద్యార్థులకు శిక్షణ ఇచ్చే సంస్థగా ప్రారంభమై 1995లో జూనియర్‌ కాలేజిగా రూపుదిద్దుకొంది. ఇటీవల స్వర్గస్తులైన డాక్టరు ఎస్‌.వి.నరసింహులు (రిటైర్డ్‌ ప్రిన్సిపాల్‌ డి.కె.డబ్ల్యూ. కాలేజి) వంటి ప్రముఖ విద్యావేత్తలు సంస్థకు మూలస్థంబాలలో ఒకరుగా వుండేవారు. 2000 మార్చిలో ఈ సంస్థ రత్నం విద్యాసంస్థలలో విలీనమయింది.
నారాయణ విద్యా సంస్థలు : ప్రైవేటు విద్యా సంస్థల స్థాపనలో నారాయణ పేరు, నారాయణ విద్యా సంస్థల పేర్లు విననివారు రాష్ట్రంలో వుండరు. 1977లో పి. నారాయణ ఒక కాలేజీలో స్టాటిస్టిక్స్‌ లెక్చరర్‌గా జీవితాన్ని ప్రారంభించారు. ఎందు కనో ఆయన అందులో కొనసాగ లేదు. కొనసాగి వుంటే ఆయనలోని ప్రజ్ఞ, ప్రతిభా పాటవాలు బయల్పడేవి కావు. 1983 నుండి విద్యాసంస్థలను ఒకటొకటిగా ప్రారంభించడం మొదలు పెట్టారు. నెల్లూరు సమీపంలోని చింతారెడ్డిపాళెం విద్యలకు కేంద్ర బిందువయింది. అక్కడనుండి విద్యాలయాలు విస్తరించాయి. క్రమంగా జిల్లా, రాష్ట్ర పరిధులు దాటింది. నేడు దేశంలో పలుచోట్ల నారాయణ విద్యాసంస్థలు (దాదాపు 300) నెలకొని వున్నాయి. ఇందులో ఐదారువేల మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. సుమారు 3 లక్షల మంది విద్యార్థులు చదువుకొంటున్నారు.

ఆయన స్వతంత్రంగా, స్వయంకృషితో ఎదిగారు. పట్టుదల, కార్యదీక్ష, మృదుస్వభావం ఆయన సహజ లక్షణాలు. ప్రస్తుతం నారాయణ సంస్థలలో ప్రీప్రైమరీ స్కూలునుండి పోస్టు గ్రాడ్యుయేట్‌ వరకు విద్యాలయాలున్నాయి. ఒలింపియాడ్‌ స్కూల్స్‌, కాన్సెప్ట్‌ స్కూల్స్‌, టెక్నో స్కూల్స్‌, జూనియర్‌ కాలేజీలు, మెడికల్‌ కాలేజీ, డెంటల్‌ కాలేజీ, ఇంజనీరింగ్‌ కాలేజి, బి.ఫార్మసి, స్కూల్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంటు, యోగ & నేచురోపతి కాలేజి, బి.ఇడి. కాలేజి వున్నాయి. విద్యార్థులకు శిక్షణ ఇవ్వడానికి ఇటీవల ఐ.ఎ.ఎస్‌. అకాడమి ప్రారంభించారు. 30 సం||ల కాలంలో (1983-2012) నారాయణ విద్యాసంస్థలు అగ్రగామిగా నిలిచాయి. ఇప్పటి వరకు రాజకీయాలకు దూరంగా వున్న నారాయణ 2014 జూన్‌లో తెలుగుదేశం ప్రభుత్వంలో మంత్రి అయ్యారు.

రత్నం విద్యా సంస్థలు : నెల్లూరు జిల్లాలో 1984లో ప్రారంభమైన రత్నం సంస్థలకు ప్రత్యేక స్థానం వుంది. కె.వి. రత్నం, వారి శ్రీమతి పద్మావతి రత్నం సంస్థ వ్యవస్థాపకులుగా వున్నారు. ప్రస్తుతం కె. వేణుగోపాల్‌ , డా|| కె. కృష్ణకిషోర్‌ సారధ్యంలో నడుస్తున్నాయి. రత్నం రెసిడెన్షియల్‌ స్కూలు, ఫార్మసి ఇన్‌స్టిట్యూట్‌, కంప్యూ టర్‌ సైన్సెస్‌ ఇన్‌స్టిట్యూట్లు నెల్లూరు సమీపంలోని పిడతా పోలూరులో, రత్నం పబ్లిక్‌ స్కూలు ధనలక్ష్మీపురంలో నిర్మించారు. రత్నం డిగ్రీ కళాశాలను హరనాథ పురంలో స్థాపించారు.

నెల్లూరు నగర పరిధిలో రత్నం ఒలింపియాడ్‌ అకాడమి క్యాంపస్‌ స్కూలు దర్గామిట్టలో, గ్లోబల్‌ స్కూలు మాగుంట లే అవుట్‌లో స్థాపించారు. వ్యాపార దృష్టితో కాకుండా విద్యాసంస్థలను ఎంతగానో అభివృద్ధి చేశారు.
ప్రియదర్శిని విద్యాసంస్థలు : నెల్లూరు జిల్లా, సూళ్ళూరుపేటలో 2001-02 సం||లో ఇంజనీరింగ్‌ కాలేజి ప్రారంభించారు. 2005-06లో నెల్లూరు పట్టణ పరిధిలో మరొక ఇంజనీరింగ్‌ కాలేజీ స్థాపించారు. ఇక్కడ యం.సి.ఏ., యం.బి.ఏ. కోర్సులు కూడ వున్నాయి. సూళ్ళూరుపేటలో ఇంజ నీరింగ్‌ కోర్సులోని పలు బ్రాంచీలను ఏర్పాటు చేశారు. ప్రియదర్శిని విద్యా సంస్థలుగా పేరుగాంచిన ఈ విద్యాలయాలు ప్రారంభం నుండి విద్యార్థులకు చదువుతో పాటు క్రమశిక్షణ వుండాలనే అంకిత భావంతో కృషి చేస్తున్నారు. జిల్లా పరిధి దాటి తిరుపతిలో కూడ ఒక కాలేజి ప్రారంభించారు.
ఆదిశంకర విద్యాసంస్థలు : గూడూరు సమీపంలో 5వ నంబరు జాతీయ రహదారి ప్రక్కన విద్యాలయాలు వున్నాయి. అన్ని వసతులతో పెద్ద భవనాలలో ఏర్పాటు చేశారు. ఇక్కడ ఇంజనీ రింగ్‌ కాలేజీలో (బి.టెక్‌) పలు బ్రాంచీలు వున్నాయి. విద్యార్థులు ఎవరికి ఆసక్తి వున్న బ్రాంచిని వారు ఎంపిక చేసుకోవచ్చు. ఇంజనీరింగ్‌ వున్నత చదువు (ఎం.టెక్‌) కోర్సు వుంది. ఎం.సి.ఏ., ఎం.బి.ఏ. కోర్సులున్నాయి. పాలిటెక్నిక్‌ కోర్సులో వివిధ బ్రాంచీలున్నాయి. ప్రత్యేకంగా మహిళలకు ఇంజనీరింగ్‌ కాలేజీ వుంది. అన్ని కోర్సులలో మంచి ప్రమాణాలు, విలువలు పాటిస్తున్నారు. జాతీయ రహదారి ప్రక్కనే వుండడం వల్ల విద్యార్థుల, అధ్యాపకుల రాకపోకలకు అనుకూలంగా వుంది.
విద్యా సంస్థలు ఊరికి బయట వున్నందున ప్రశాంత వాతావరణం వుంటుంది. నెల్లూరు, వెంకటగిరి, నాయుడుపేట, బుచ్చిరెడ్డిపాళెంలో టెక్నో స్కూల్స్‌ ప్రారంభించారు. విద్యాసంస్థల అధినేత వంకి పెంచలయ్య తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుండి ఇటీవల డాక్టరేటు పట్టా పొందారు.
గీతాంజలి విద్యా సంస్థలు : నెల్లూరు సమీపంలో ముత్తుకూరు రోడ్డులో విద్యాలయం వుంది. 2002లో యం.సి.ఏ., 2007లో యం.బి.ఏ. కోర్సులు ప్రారంభించారు. అన్ని హంగులతో, అనుభవం కలిగిన లెక్చరర్లతో కాలేజీ ఉన్నతంగా సాగుతుంది.
గీతాంజలి సైన్స్‌ & టెక్నాలజి విద్యాసంస్థలు : నెల్లూరు నుండి బొంబాయి వెళ్లే రహదారి మార్గంలో ఐదవ కి.మీ. వద్ద గంగవరం గ్రామ సమీపాన సాంకేతిక విద్యాలయాన్ని నెలకొల్పారు. ఇందులో ఇంజనీరింగ్‌ విద్య పలు బ్రాంచీలలో సమర్ధవంతంగా నిర్వహిస్తున్నారు.
మహిళా విద్యాలయాలు
కస్తూరిదేవి విద్యాలయం : పొణకా కనకమ్మ 1923లో కస్తూరి దేవి విద్యాలయం స్థాపించి, బాలికల విద్యకు నాంది పలికారు. ఈ పాఠశాలను ముత్తరాజువారివీధిలో టంగుటూరి ప్రకాశం పంతులు ప్రారంభించారు. అటు తర్వాత ఇప్పుడున్న విశాలమైన ప్రాంగణాన్ని కనకమ్మ సంపాదించారు. ఈ విద్యాలయం హైస్కూలు చదువుల వరకు పరిమితం. కొంత కాలం తిక్కవరపు రామిరెడ్డి విద్యాలయ బాధ్యతలు నిర్వహించారు.
మిషనరీల ఆధ్వర్యంలో ఎ.బి.యం. చర్చి ప్రాంగణంలో బాలికల పాఠశాల 1904లో ప్రారంభమయింది. దాదాపు శతాబ్ది పాటు విద్యనందించి ఈ మధ్య కాలంలో ఇది మూతపడింది.
దొడ్ల కౌసల్యమ్మ మహిళా కళాశాల : నెల్లూరు జిల్లాలో మొదటి మహిళా కళాశాల దొడ్ల సుబ్బారెడ్డి సతీమణి దాతృత్వంతో ప్రారంభించబడింది. డి.కె. డబ్ల్యూ. కాలేజిగా ప్రసిద్ధి చెందింది. 1964లో పొదలకూరురోడ్డు ప్రాంతంలో సుమారు 50 ఎకరాల ప్రదేశంలో స్థాపించబడింది. ఇంటర్‌, డిగ్రీ, పోస్టుగ్రాడ్యుయేట్‌ విద్యల నందించే మహిళా కళాశాలగా సింహపురికి తలమా నికంగా వుంది. విద్యా లయ ప్రాంగణంలో హాస్టల్‌, క్యాంటిన్‌, క్రీడాస్థలం, ఆడి టోరియం వంటి సౌకర్యాలున్నాయి. ఇటీవల సం||లలో ఉత్తీర్ణత శాతం బాగా పెరిగింది. జాతీయస్థాయిలో (నాక్‌) ‘ఏ’ గ్రేడు పొందిన కళాశాలగా గుర్తింపు పొందింది. కాలేజి ప్రారంభించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంలో 2014లో స్వర్ణోత్సవాలు జరుపుకుంటుంది. నాడు 60 మందితో ప్రారంభమై నేడు వేలాది మంది విద్యార్థినులతో విలసిల్లుతుంది.
గోపాలరెడ్డి మహిళా కళాశాల : డాక్టర్‌ బెజవాడ గోపాలరెడ్డి వుమెన్స్‌ అకాడమీ పేరుతో 1997లో మహిళలకు డిగ్రీ కాలేజి ఏర్పాటు చేశారు. ఇది కస్తూరిదేవి విద్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేశారు. పలుగ్రూపులు, సబ్జెక్టులతో బి.ఎస్‌సి., బి.కాం. చదువులున్నాయి. మంచి చదువులతో పాటు విద్యార్థినులకు సకల వసతులు వున్నాయి. ఈ ప్రదేశం మహిళలకు సురక్షితమైన ప్రాంతం. కాలుష్యరహిత వాతావరణంలో వుంది. విద్యాలయానికి కరె స్పాండెంట్‌గా జె.వి.రెడ్డి బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
డి.ఆర్‌. వుమెన్స్‌ కాలేజి : గూడూరులోని వుమెన్స్‌ కాలేజి ప్రత్యేకించి విద్యార్థినుల కొరకు స్థాపించబడింది. ఇందులో ఎం.సి.ఏ., ఎం.బి.ఏ., కోర్సులున్నాయి.
రామకృష్ణ విద్యాసంస్థలు : అల్లూరులో 1928లో ఉన్నత పాఠశాలగా ప్రారంభమై క్రమంగా జూనియర్‌ కాలేజీ, డిగ్రీ కాలేజీ, పిజీ కళాశాలతో నేడు విరాజిల్లుతున్న రామకృష్ణ విద్యాసంస్థలకు మంచి పేరుంది.

విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం : ఇది జిల్లాలోని ఏకైక విశ్వవిద్యాలయం. దీనిని ఆగష్టు 2008లో అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి హయాంలో ప్రారంభించారు. జిల్లాలోని విద్యాలయాలు ఈ పరిధిలోకి వస్తాయి. విశ్వవిద్యాలయ ప్రారంభంలో ఉపకులపతిగా ఆచార్య విశ్వేశ్వరరావు, రిజిష్ట్రారుగా ప్రొఫెసరు నారాయణరెడ్డి పనిచేశారు. ప్రస్తుతం ఆచార్య జి. రాజారామిరెడ్డి ఉపకుల పతిగాను, నాగేంద్రప్రసాద్‌ రిజిష్ట్రారుగా వున్నారు. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాల యానికి సంబంధించిన 130 ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలను విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ పరిధిలోనికి తెచ్చారు. కావలిలోని విశ్వోదయ సంస్థలు, విద్యానగర్‌లోని బాలకృష్ణారెడ్డి సంస్థలు ఈ విశ్వ విద్యాలయానికి అనుబంధంగా వున్నాయి.
‘అబాకస్‌’ శిక్షణ : ఇటీవల వెలుగులోకి వస్తున్న ఒక వైవిధ్యమైన సాంకేతిక శిక్షణ. దీనివల్ల మూడు నుండి పదేళ్ల వయస్సులోని చిన్నారులలో చురుకుదనం, గ్రహణశక్తి, జ్ఞాపకశక్తి పెరుగుతుంది. భవిష్యత్తులో వారికి ఏ విద్యలోనైనా రాణించడానికి పునాది ఏర్పడుతుంది. ఇప్పుడిప్పుడే ప్రాధాన్యత సంతరించు కొంటున్న ‘అబాకస్‌’ శిక్షణనిచ్చే సంస్థలు నెల్లూరు నగరంలో అందుబాటులో వున్నాయి.
క్రీడా శిక్షణ మండలి : వ్యాయామము, క్రీడలు అనేవి చదువులో ఒక భాగం. నెల్లూరులోని ఏ.సి. సుబ్బారెడ్డి క్రీడా ప్రాంగణం (స్టేడియం)లో జిల్లా క్రీడా శిక్షణా మండలి వుంది. నెల్లూరుసీమ విద్యలలో రాణించినట్లే ఆటలలో కూడ ప్రావీణ్యం సాధించడానికి శిక్షణా మండలి ఉపయోగంగా వుంది. నిత్యం స్టేడియంలో బాలబాలిలు, ఔత్సాహికులు అభ్యాసం చేస్తుంటారు. ప్రావీణ్యత సంపాదించిన వారికి అంతరజిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలలో పాల్గొనే అవకాశం కలుగుతుంది. ఆటల వల్ల యువతరానికి శారీరిక ఆరోగ్యంతోపాటు మానసికోల్లాసం కూడ పెరుగుతుందనేది అందరికి తెలిసిందే. నడక ముఖ్యమైన వ్యాయామం కనుక వృద్ధులు నడవడానికిది సురక్షిత ప్రదేశం.
జనవిజ్ఞాన వేదిక : నెల్లూరులో 1988లో జనవిజ్ఞాన వేదికను మేధావి వర్గానికి చెందిన కొందరు కలిసి ప్రారంభించారు. సాధారణ పౌరులను విజ్ఞానవంతులను చేయడం విద్యలో ఒక భాగం. ప్రజలలో మూఢాచారాలను నిర్మూలించి, శాస్త్రబద్ధమైన, విజ్ఞానదాయకమైన పంధాలో నడవాలని తెలియజెప్పేది జన విజ్ఞాన వేదిక. ఒకప్పుడు తేలు కుట్టినా, పాము కరిచినా మంత్రాలు వేయడం, లింగాలు కట్టడం చేసేవారు. తర్వాత కాలంలో అవి శాస్త్రబద్ధం కావని, మూఢ నమ్మకాలని తేలిపోయింది. ఇప్పుడు విష విరుగుడుకు మందులొచ్చాయి. ఒకప్పుడు కలరా, మశూచి (అమ్మవారు) వ్యాధుల వల్ల అధికంగా మరణాలు సంభవించేవి. అమ్మవారికి కోపం వచ్చి ఇలా చేసిందని, ఆమెను శాంతింపచేయడానికి 40 రోజుల పాటు వూరంతా కలిసి పూజలు, భజనలు చేసేవారు. ఈలోగా వ్యాధుల ఉధృతి ఎలాగో అదేతగ్గేది. తర్వాత కాలంలో కలరా వ్యాధి ఒక సూక్ష్మజీవి వల్ల వస్తుందని, మశూచి ఒకరకమైన వైరస్‌ వల్ల వస్తుందని గుర్తించారు. శాస్త్ర విజ్ఞానం పెరగడంతో ఇప్పుడా వ్యాధులు పూర్తిగా నియంత్రించబడ్డాయి. ఒకప్పుడు దయ్యాలు, చేతబడులు అనేవి బాగా ప్రచారంలో వుండేవి. ప్రజలలోని మూఢనమ్మకాలను ఆసరాగా చేసుకొని భూతవైద్యులు, మంత్రగాళ్లు అని చెప్పుకొంటూ కొందరు లాభపడేవాళ్లు. జనవిజ్ఞాన వేదిక ఆవిర్భవించిన తర్వాత వాటిని కట్టుకథలుగా, అభూతకల్పనలుగా ప్రజలలో అవగాహన కలిగించారు. ఇప్పటికి మారుమూల గ్రామాలలో వీటిని నమ్మేవారు, మంత్రగాళ్ల దోపిడికి గురయ్యేవారు లేకపోలేదు. నెల్లూరులో 1989-90లో సాక్షరతా ఉద్యమం చేప్పట్టింది.1992-1993లో ఉవ్వెత్తున లేచిన సారా వ్యతిరేకోద్యమానికి జనవిజ్ఞాన వేదిక మద్దతు యిచ్చి పోరాడింది. ప్రజలను చైతన్యవంతులను చేసింది. శాస్త్రబద్ధమైన, హేతుబద్ధమైన భావాలను బలపరచింది, కానిదాన్ని నిర్ద్వంద్వంగా ఖండించింది. డా||విజయ కుమార్‌, డా|| పూండ్ల శ్రీనివాసులు రెడ్డి, రవికుమార్‌, ఎన్‌.కె. జకీర్‌, సిహెచ్‌. ఉషారాణి, జి. మాల్యాద్రి, డా|| ఎం.వి. రమణయ్య, షేక్‌ గౌస్‌బాషా, కె. కృష్ణా రెడ్డి తదితరులు ఈ దిశలో విశేష కృషి చేస్తున్నారు. శాసన మండలి సభ్యుడు విఠపు బాలసుబ్రహ్మణ్యం జనవిజ్ఞాన వేదికకు మద్దతుగా వున్నారు.
నెల్లూరు వర్ధమాన సమాజము (నెల్లూరు ప్రోగ్రెసివ్‌ యూనియన్‌) :
నెల్లూరులో 1906లో ఏర్పాటు చేయబడిన సమాజము. ఆ మరుసటేడాది ఉచిత పఠన మందిరం ప్రారంభమయింది. అది గ్రంథాలయానికి బీజమయింది. అప్పటికి, ఇప్పటికి ఎంతో ప్రాధాన్యంతో వెలుగుతోంది. నెల్లూరు అనగానే గుర్తుకొచ్చేవి తిక్కన వ్రాసిన భారతం, ఇక్కడ పండే మొలగొలుకులు, ప్రవహించే పెన్నానది, దాని ఒడ్డున వుండే రంగానాథ దేవాలయం, రేబాల లక్ష్మీనరసారెడ్డి పురమందిరం, అందులో అంతర్భాగంగా వున్న వర్థమాన సమాజ గ్రంధాలయం. ఈ సమాజానికి వందేళ్ల చరిత్ర వుంది. మొదట ట్రంకురోడ్డులోని ఒక ఇంటిలో ప్రారంభమై వెనువెంటనే 1911లో గ్రంథాలయం ఆవిర్భవించింది. అంతలో పురమందిర నిర్మాణం పూర్తి కావడంతో 1915లో ఆ ప్రాంగణంలోకి మారింది. నేడు 45 వేల పుస్తకాలతో రాష్ట్రంలో అతిపెద్ద గ్రంథాలయంగా విరాజిల్లుతుంది. ఇందులో మూడు భాగాలున్నాయి. తిక్కన తెలుగు గ్రంథాలయం, వేదం వెంకట్రాయశాస్త్రి సంస్కృత గ్రంథాలయం, కారొనేషన్‌ ఇంగ్లీషు పుస్తకాల విభాగం. ఇవిగాక రేబాల పట్టాభి రామిరెడ్డి పఠన మందిరముంది. ఇంగ్లీషు, తెలుగు దిన, వార, మాస పత్రికలు సాధారణ పాఠకులకు అందుబాటులో వుంటాయి. నిత్యం గ్రంథాలయ సేవలను పాఠకులేకాక పరిశోధనా విద్యార్థులు కూడ ప్రయోజనం పొందుతున్నారు. స్వర్గీయులు పెల్లేటి పెంచలరెడ్డి, రావు బహదూర్‌ రేబాల లక్ష్మీనరసారెడ్డి, రేబాల పట్టాభిరామిరెడ్డి, రేబాల సుజాతమ్మ, వేదం వెంకట్రాయశాస్త్రి, టి.వి. వెంకటరామ అయ్యర్‌, మాడభూషి నరసింహా చార్యులు, రావుబహదూర్‌ చంగయ్య పంతులు, రావుబహదూర్‌ కృష్ణారావు పంతులు, పి.వి.రమణారెడ్డి, తిక్కవరపు రామిరెడ్డి, ‘దానవీర’ రేబాల లక్ష్మీ నరసారెడ్డి వంటి వదాన్యులు, మేధావులు వర్ధమాన సమాజ గ్రంథాలయానికి ఆద్యులు, పునాది కర్తలు. ప్రస్తుత సమాజ అధ్యక్షులుగా పి.వి. కృష్ణారెడ్డి, కార్యదర్శిగా మజ్జిగ ప్రభాకర్‌ రెడ్డి, గ్రంథాలయాధికారిగా వల్లకవి వెంకట సుబ్బారావు కొనసాగుతున్నారు.
తెలుగు భాషోన్నతి సేవలు : దీని కొరకు జిల్లాలో ఎందరో మహాను భావులు పలు సంఘాలను, సమాజాలను ఏర్పరచి కృషి చేస్తున్నారు. మాతృ భాషంటే ఎవరికైనా అభిమానం. అవసరార్థమో, మరో కారణంగానో పరభాషను నేర్చుకొంటున్నాం. అంతమటుకే పరిమితం కావాలి. (ఇప్పుడు మనం తెలుగులో రెండు వాక్యాలు మాట్లాడితే నాలుగు ఇంగ్లీషు మాటలు దొర్లుతున్నాయి. ఇది మారకుంటే క్రమంగా అమ్మ భాష అంతరించిపోయే ప్రమాదముంది) తెలుగు భాషను ప్రేమించడం, గౌరవించడం అలవరచుకోవాలి. ఆంధ్రప్రదేశ్‌ ఆంగ్ల ప్రదేశ్‌గా మారకుండా జాగ్రత్తపడాలి.
మాతృభాష తెలుగుపై అభిమానంతో, మమ్మీ, డాడీ విదేశ సంస్కృతిని విడనాడాలనే భావనతో ఆచార్య ఆదిత్య, చెలంచర్ల భాస్కరరెడ్డి, ఎన్‌. దశరధ రామయ్య వంటి భాషాభిమానులు, అభ్యుదయవాదులు ఈ దిశలో కృషి చేస్తున్నారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఎంతమంది అధికార భాషా సంఘ అధ్యక్షులు వచ్చినా ప్రభుత్వ పాలనా యంత్రాంగంలో, చట్ట సభలలో తెలుగు భాషకు తగిన గౌరవం ప్రాధాన్యత లభించడం లేదన్న ఆవేదనతో అలుపెరుగని పోరాటం చేస్తున్నారు. నెల్లూరు జిల్లాలో తెలుగు భాషోద్యమ సమితి 2004 నవంబరులో ఏర్పడి నిర్విరామంగా కృషి చేస్తుంది. విద్యాబోధన, ప్రభుత్వ పాలన, తెలుగులోకి పూర్తిగా తీసుకొస్తే మన భాషతోపాటు సాహిత్యాన్ని, సాంస్కృతీ సాంప్రదాయాలు రక్షించుకోవచ్చు.
నాలుగో ప్రపంచ తెలుగు మహాసభలను 2012 డిసంబరులో మూడు రోజులపాటు ప్రభుత్వం తిరుపతిలో ఘనంగా నిర్వహించింది. అధికార భాషా సంఘ అధ్యక్షులతోపాటు పలువురు మేధావులు, కవి పండితులు సూచనల మేరకు తెలుగుభాష ప్రాధాన్యత పెంచాలని, సముచిత గౌరవం కల్పించాలని తీర్మానాలు చేసింది. వీటిని ఆచరణలో పెడితే సత్ఫలితాలు సాధించవచ్చు.
తెలుగు పద్యాలను కాపాడాలని విశ్రాంత ఉపాధ్యాయులు మెట్టు రామచంద్రప్రసాద్‌, తెలుగును నలుదిశల వ్యాప్తి చేయాలని విశ్రాంత ఉపన్యాసకులు మోపూరు వేణుగోపాలయ్య, తెలుగు నాటకరంగం ద్వారా భాషా ప్రాధాన్యాన్ని పెంచాలని భూస్వాముల కుటుంబానికి చెందిన పెళ్ళూరు సుధాకరరెడ్డి, తెలుగుపై విద్యార్థులకు ఆసక్తి పెంచాలని తెలుగు పండితులు ఆలూరి శిరోమణిశర్మ, రావుల వెంకటేశ్వరరావు, చల్లా గంగేశ్వరరావు, సబ్బు ప్రవీణ్‌ కుమార్‌ మొదలయినవారు తమ పరిధిలో భాషాసేవ లందిస్తున్నారు.
సన్నాడి వెంకట రమేష్‌ : రమేష్‌ తండ్రి నెల్లూరు జిల్లా, సూళ్ళూరుపేట ప్రళయకావేరి తీర ప్రాంతం నుండి తమిళనాడులోని కృష్ణగిరి జిల్లా ¬సూరుకు వెళ్ళి స్థిరపడ్డారు. రమేష్‌ కృష్ణగిరి జిల్లా రచయితల సంఘం స్థాపించి అక్కడి తెలుగు వారిని ప్రతి వారం సమావేశపరుస్తూ తెలుగు పరిరక్షణ ఉద్యమం చేపట్టారు. చిన్నతనంలో అమ్మమ్మ ఇంటికి వస్తుండిన రమేష్‌ తన అనుభవాలతో ప్రళయ కావేరి కథలు వ్రాశారు. పొరుగు రాష్ట్రమైన తమిళనాడులో తెలుగు భాషోన్నతి సేవలందిస్తున్నారు.
విదేశీయుడైన సి.పి. బ్రౌన్‌ తెలుగు భాష నేర్చుకొని ఏకంగా నిఘంటువు (డిక్షనరి) రూపొందించే స్థాయికెదగడం వారి తెలుగు భాషాభిమానానికి, సేవకు అద్దం పడుతుంది. ఈ భాషలోని మాధుర్యాన్ని ఆస్వాదించారు.
వావిళ్ల ముద్రాక్షరశాల : గ్రంథ ప్రచురణలకు పితామహుడుగా పేర్కొన తగిన వావిళ్ల రామస్వామిశాస్త్రి నెల్లూరుసీమ విడవలూరు మండలం వావిళ్ళకు చెందినవారు. తెలుగు వాఙ్మయానికి వీరు చేసిన సేవలు వెలకట్టలేనివి. చేతి వ్రాత పుస్తకాలు చదువుకొనే రోజుల్లో సుమారు 160 ఏళ్ళ క్రితం మద్రాసు నగరంలో ముద్రణాలయాన్ని స్థాపించారు. రామాయణ, భారత, భాగవత పురాణాలతో పాటు పలు ఇతర తెలుగు, సంస్కృత, తమిళ గ్రంథాలను ముద్రిం చారు.మద్రాసు ప్రజలు వారికి గజారోహణ ఉత్సవం జరిపి గౌరవించారు. రామశాస్త్రి స్వయంగా మనుచరిత్ర, ఆముక్తమాల్యద గ్రంథాలకు వ్యాఖ్య వ్రాశారు. శాస్త్రిగారి తర్వాత వారి కుమారుడు వెంకటేశ్వరశాస్త్రి ప్రచురణల బాధ్యత చేపట్టారు. ముద్రణలో కొత్త పద్ధతులు ప్రవేశపెట్టి అనేక కావ్యాలను ముద్రిం చారు. వావిళ్ల ప్రెస్‌ నుండి వందల సంఖ్యలో గ్రంథాలు వెలువడ్డాయి. ప్రఖ్యాతి చెందిన శంకర నారాయణ నిఘంటువును పలుమార్లు ముద్రించిన ఖ్యాతి వీరికుంది. వావిళ్ళ వారి పేరు తెలియని వారుండరు. వావిళ్లవారి ప్రచురణలంటే భూతద్దం పెట్టి వెతికినా అచ్చుతప్పులుండవని ఆ రోజుల్లోనే పేరుండేది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.