*రూ.150 కోట్లతో అభివృద్ధి పనులు*
*రూ.2.5 కోట్లతో సాగర్ నగర్ లో నైట్ ఫుడ్ కోర్టు*
_*విశాఖ డిసెంబర్ 18పున్నమి ప్రతినిధి*:_ జీవీఎంసీ 8 వ వార్డు పరిధిలోని ఎండాడ, రుషికొండ, సాగర్ నగర్, వైఎల్పీ లే అవుట్, పాత మధురవాడ తదితర ప్రాంతాల్లో 7.74 కోట్లతో ప్రతిపాదించిన అభివృద్ధి పనులకు భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు గురువారం శంకుస్థాపన చేశారు. వీటిలో రూ.4.28 కోట్లతో 9 రోడ్లు, రూ. కోటితో 4 డ్రెయిన్లు, రూ.38 లక్షలతో 2 పార్కులు, రూ.1.60 కోట్లతో 2 శ్మశాన వాటికలు ఏర్పాటు సహా రూ. 46 లక్షలతో చెరువు అభివృద్ధి పనులు ఉన్నాయి. ఈ సందర్భంగా గంటా మాట్లాడుతూ భీమిలి నియోజకవర్గంలోని 9 జీవీఎంసీ వార్డుల్లో రూ.150 కోట్లకు పైగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయని చెప్పారు. ఒక్క నవంబరు నెలలోనే రూ.25 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామన్నారు. రూ. 500 కోట్లతో మధురవాడకు మంచినీటి ప్రాజెక్టు.. రూ. 465 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ప్రాజెక్టు పనులు తొందర్లోనే ప్రారంభం కానున్నాయని వెల్లడించారు. సాగర్ నగర్ బీచ్ బ్యూటిఫికేషన్ కోసం రూ.16 కోట్ల ప్రాజెక్టు డిజైన్ చేశామని, అలాగే 2.5 కోట్లతో సాగర్ నగర్ లోనే నైట్ ఫుడ్ కోర్టు ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక అభివృద్ధి పనులు వెల్లువలా జరుగుతున్నాయన్నారు. మధురవాడ ఐటీకి కేరాఫ్ అడ్రస్ గా మారనుందని, కాగ్నిజెంట్, సత్వా, ఫ్లూయాంట్ గ్రిడ్, ఇమేజినేటేవ్ వంటి 9 ఐటీ.. ఐటీ ఆధారిత కంపెనీలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఐటీ శాఖ మంత్రి లోకేష్ ఇటీవల శంకుస్థాపన చేశారన్నారు. తొందర్లోనే ఇన్ఫోసిస్, యాక్సెంచర్ పూర్తిస్థాయి భవనాలకు శంకుస్థాపన చేయనున్నారని, ఐటీ సంస్థలన్నీ అందుబాటులోకి వస్తే దాదాపు లక్షన్నర నుంచి రెండు లక్షల మందికి యువతకు ఉపాధి కలుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో కాలుష్య నియంత్రణ మండలి సభ్యుడు పంచకర్ల సందీప్, కార్పొరేటర్ లొడగల అప్పారావు, కూటమి నాయకులు చిక్కాల విజయ్ బాబు, చెట్టిపల్లి సన్యాసిరావు, శాఖారి శ్రీనివాస్, మంగాదేవి, చెట్టిపల్లి గోపీ, దొరబాబు, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.


