14 సంవత్సరాల లోపు పిల్లలకు విద్యా హక్కును కల్పించడం మరియు వారిని ప్రమాదకరమైన పనుల నుండి రక్షించాలనే ప్రధాన ఉద్దేశ్యంతో ప్రపంచ బాలకార్మిక వ్యతిరేక దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జూన్ 12న నిర్వహిస్తారు. బాల కార్మిక వ్యవస్థపై ప్రపంచవ్యాప్తంగా అవగాహన పెంచడానికి, ఈ పద్ధతిని పూర్తిగా నిర్మూలించడానికి ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ అయిన అంతర్జాతీయ కార్మిక సంస్థ 2002లో ఈ దినోత్సవాన్ని ప్రారంభించింది. భారతదేశంలో కూడా బాల కార్మిక వ్యవస్థను నిషేధిస్తూ మరియు నియంత్రిస్తూ బాల కార్మిక చట్టం1986 అమలులోకి వచ్చింది. దీనిని మరింత బలోపేతం చేస్తూ 2016లో సవరణలు కూడా చేశారు. అయినా ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా దాదాపు 160 మిలియన్ల మంది పిల్లలు బాల కార్మికులుగా మగ్గిపోతున్నారు. ఇందులో అత్యధికంగా ఆఫ్రికా లో 72 మిలియన్లు, ఆసియా-పసిఫిక్ ప్రాంతాలలో 62 మిలియన్లు బాల కార్మికులు ఉన్నారు. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలతో పాటు ప్రతి ఒక్క పౌరుడు బాధ్యతగా వ్యవహరించి బాల కార్మిక వ్యవస్థను అంతం చేయడానికి పిల్లలకు చేతి నిండా పని కాకుండా, పుస్తకాలు పట్టుకుని చదువుకునే హక్కును పెంపొందించాలని ఆశిస్తూ ఈ కవితాత్మక సందేశం.
✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️
మాతృమూర్తి కలల కీర్తికి ప్రతిరూపం
భూమిపై సంచరించు స్వేచ్ఛా జీవుల రూపం
బాల్యం మధుర జ్ఞాపక జీవన పరిమళ పుష్పం
స్వేచ్ఛ పరిమళాన్ని హరించి పనిచేయిస్తే పాపం
పలక బలపం నుంచి పుస్తక కలం వరకు
పాఠ్యపఠనం నుండి జీవితానుభవం వరకు
ఎదగాల్సిన బాల్యం కూలి పనుల్లో శూన్యం
కర్మాగారాల్లో గారాభం లేని జీవన భారం
పేదరికం పెద్దరికమై చిన్నారులను నడిపిస్తున్న తీరు
ఆశలు ఆశయాలను తొక్కేసే స్వార్థపరుల వ్యవస్థల జోరు
తల్లిదండ్రుల చైతన్యంతో ఎదగగలిగే రేపటి పౌరులు
కర్మాగారాల అభివృద్ధి విస్తరణకు ప్రగతిదారులు
బాల కార్మిక వ్యవస్థను అంతం చేసే వజ్రాయుధాలు
బడిబాటలో ఆలోచన సుమాలు చల్లుదాం
విజ్ఞాన వినోద కార్యక్రమాలు చేపడుదాం
బాల భవిష్యత్తుకు వెలుగులు నింపుదాం
బాల కార్మిక వ్యవస్థకు అంతం పలుకుదాం
బాల భావిభవిష్యత్ ప్రగతి నిర్మాణం చేద్దాం
🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻


