పున్నమి న్యూస్ ప్రతినిధి:
వేముల, సెప్టెంబర్ 8: ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పించేందుకు వేముల మండలం వెంకటేశ్వరపురంలో ‘పొలం పిలుస్తోంది’ కార్యక్రమాన్ని మండల వ్యవసాయ అధికారి జి.వి. పెద్దఓబులేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు.
ప్రకృతి వ్యవసాయ రైతులు చందా రాజీవ్ రెడ్డి, సంగిరెడ్డి సాగు చేస్తున్న మూడు ఎకరాల చీని తోటను అధికారులు పరిశీలించారు. ప్రధాన పంటతో పాటు ఏ-గ్రేడ్ మోడల్లో ఆకుకూరలు, కూరగాయలు తదితర 8 రకాల అంతర పంటలను సాగు చేస్తున్న విధానాన్ని రైతులకు వివరించారు. ఒక పంటకు ధర తగ్గినా, మరో పంట ద్వారా ఆదాయం పొందే అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు.
అనంతరం రైతులకు జీవామృతం, వివిధ కషాయాల తయారీ, వినియోగంపై అవగాహన కల్పించారు. రైతుల సమక్షంలో 200 లీటర్ల జీవామృతాన్ని తయారు చేయించారు. అలాగే రాజీవ్ రెడ్డి బయో రీసోర్స్ సెంటర్ను మండల వ్యవసాయ అధికారి పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో వీఏఏలు నియాజ్, కిషోర్ నాయక్, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది, ఫార్మర్ మాస్టర్ ట్రైనర్లు ఎం. రామ్మోహన్ నాయుడు, కృష్ణయ్య, అంజన్ రెడ్డి, వెంకటేష్, ఐసీఆర్పీలు, రాజీవ్ రెడ్డి, నరసింహులు తదితరులతో పాటు రైతులు పాల్గొన్నారు.




