పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్ :
యలమంచిలి : పురపాలక సంఘ సాధారణ ఎన్నికల నిర్వహణలో భాగంగా పట్టణంలోని 32 వార్డులకు సంబంధించి 63 పోలింగ్ స్టేషన్ల డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌పై రాజకీయ పార్టీల ప్రతినిధులతో శుక్రవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన సర్కులర్ నెం. 525/ఎస్ఈసి- ఎఫ్2/2026 నిబంధనల మేరకు మున్సిపల్ కమిషనర్ ఛాంబర్లో ఈ సమావేశాన్ని నిర్వహించారు. ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలపై సూచనలు, సలహాలు, అభ్యంతరాల స్వీకరణ కోసం ఏర్పాటు చేసిన ఈ చర్చలో తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడు గొర్లి నానాజీ, జనసేన పార్టీ పట్టణ అధ్యక్షుడు బొద్ధపు శ్రీనివాసరావు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు బెజవాడ నాగేశ్వరరావు, భారతీయ జనతా పార్టీ ప్రతినిధి షేక్ రహీం బీబీ పాల్గొని తమ అభిప్రాయాలను, సూచనలను లిఖితపూర్వకంగా మున్సిపల్ అధికారులకు తెలియజేశారు. రాజకీయ పార్టీల నుంచి వచ్చిన అంశాలను పరిశీలించిన అనంతరం ఈ నెల 13వ తేదీన తుది పోలింగ్ కేంద్రాల జాబితాను అధికారికంగా ప్రచురించనున్నట్లు మున్సిపల్ కమిషనర్ బి జే యస్. ప్రసాద్ రాజు స్పష్టం చేశారు.


