పేదింటి ఆడపడుచుల వివాహాలకు అండగా మాజీ సర్పంచ్ మంగ శ్రీనివాస్
మంచాల మండలం, ఆగస్టు 16: పేద కుటుంబాల ఆడపడుచుల వివాహాలకు అండగా నిలుస్తూ మాజీ బండలేమూర్ గ్రామ సర్పంచ్ మంగ శ్రీనివాస్ తన సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా బండలేమూర్ గ్రామానికి చెందిన సభావట్ శారద–భాగ్య దంపతుల కుమార్తె లలిత, పాతులోత్ సుజాత–కేశ్య (లేట్) దంపతుల కుమార్తె సింధు వివాహాలకు రూ.20,000 ఆర్థిక సహాయాన్ని పెళ్లి కానుకగా అందజేశారు.
ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు మాట్లాడుతూ.. కష్టసమయంలో తమను ఆదుకునేందుకు ఎవరూ ముందుకు రాని పరిస్థితుల్లో, తమ ఇంటికి వచ్చి అన్నగా, మామగా ఆప్యాయతతో ఆర్థిక సహాయం అందించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. పదవులు, పార్టీలకు అతీతంగా ప్రజల కష్టాలను తెలుసుకుని వారికి అండగా నిలుస్తున్న మంగ శ్రీనివాస్ సేవలను అభినందించారు.
గత 10–12 సంవత్సరాలుగా ప్రజాసేవలో ఉంటూ, నిరుపేద కుటుంబాలకు తనవంతు సహాయం చేస్తూ వస్తున్న మంగ శ్రీనివాస్ సేవలు తమ గ్రామానికే కాకుండా మంచాల మండలానికి, రంగారెడ్డి జిల్లాకు ఆదర్శంగా నిలుస్తున్నాయని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఆయనకు, ఆయన కుటుంబానికి భగవంతుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ వార్డు నెంబర్ శిరీష చందు, మాజీ ఎంపీటీసీ మధుసూదన్ రెడ్డి, తుల్జా భవాని ప్రెసిడెంట్ కేలోత్ సురేందర్, తుల్జా భవాని కోశాధికారి, కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు జాట్రోత్ నవీన్ కుమార్, మాజీ విద్యా కమిటీ చైర్మన్ మునిరాజ్, కాంగ్రెస్ యువ నాయకుడు పాతులోత్ మహేష్, కాంగ్రెస్ సీనియర్ ఎస్టీ సెల్ నాయకులు ఫుల్ సింగ్ నాయక్, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.



