పాఠశాల విద్యాశాఖ – సమగ్ర శిక్ష (సహిత విద్య) ఆధ్వర్యంలో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఎన్జీఓ హోమ్‌లో ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులకు ఉచిత సహాయక పరికరాల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 394 మంది ప్రత్యేక అవసరాలున్న విద్యార్థులకు రూ.22.14 లక్షల విలువైన సహాయక ఉపకరణాలను పంపిణీ చేశారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ ఆనం అరుణమ్మ మాట్లాడుతూ, 2025–26 విద్యా సంవత్సరంలో విభిన్న ప్రతిభావంతులైన విద్యార్థుల కోసం ప్రభుత్వం ద్వారా ఎస్కార్ట్ అలవెన్స్, ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్, బాలికల స్టైపెండ్, హోమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ తదితర పథకాల కింద మొత్తం రూ.71.82 లక్షల బడ్జెట్‌తో ఆర్థిక సహాయం అందించామని తెలిపారు.
నెల్లూరు నగర మేయర్ దేవరకొండ సుజాత మాట్లాడుతూ, నగర పాలక సంస్థ తరఫున ప్రత్యేక అవసరాలున్న పిల్లలకు అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు అన్ని విధాలుగా సహకరిస్తున్నట్లు తెలిపారు.
జిల్లా విద్యాశాఖాధికారి డా. రాజా బాలాజీ రావు మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుతున్నందున ఈ విద్యా సంవత్సరంలో సాధారణ విద్యార్థులతో పాటు ప్రత్యేక అవసరాలున్న విద్యార్థులు కూడా అత్యుత్తమ ఫలితాలు సాధించారని తెలిపారు. ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి వారి భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు.
అలింకో సంస్థ సహకారంతో 2025–26 సంవత్సరానికి ఎంపికైన 394 మంది విద్యార్థులకు ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించి, వారి అవసరాలకు అనుగుణంగా ఈ రోజు సహాయక పరికరాలను పంపిణీ చేశారు. వీటిలో హియరింగ్ ఎయిడ్స్, బ్రెయిల్ కిట్లు, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ (TLM) కిట్లు, వీల్‌చైర్లు, మోటరైజ్డ్ ట్రైసైకిళ్లు, రోలేటర్లు వంటి పరికరాలు ఉన్నాయి.
అదనపు ప్రాజెక్టు కోఆర్డినేటర్ డి. వెంకట సుబ్బయ్య మాట్లాడుతూ, సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో దేశంలోనే తొలిసారిగా పీఎం శ్రీ పథకం కింద జిల్లాలో 6 ప్రత్యేక ఆటిజం కేంద్రాలు మంజూరయ్యాయని తెలిపారు. నెల్లూరు, బుచ్చిరెడ్డిపాలెం, ఆత్మకూరు, కావలి, వింజమూరు, గూడూరు ప్రాంతాల్లో ఈ కేంద్రాల భవన నిర్మాణ పనులు వివిధ దశల్లో కొనసాగుతున్నాయని చెప్పారు. ఈ కేంద్రాల ద్వారా ఒక్కో విద్యార్థికి రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు ఉచిత వైద్య సేవలు, అలాగే ప్రతి ప్రత్యేక అవసరాలున్న విద్యార్థికి ఉచిత ఫిజియోథెరపీ సేవలు అందించనున్నట్లు వెల్లడించారు.
పంపిణీ చేసిన ముఖ్య పరికరాలు
టీఎల్‌ఎం కిట్లు (ఎర్లీ ఇంటర్వెన్షన్ గ్రూప్) – 3
టీఎల్‌ఎం కిట్లు (సెకండరీ & ప్రీ-వొకేషనల్ గ్రూప్) – 140
మమత మోడల్ వీల్‌చైర్లు – 17
బ్యాటరీ ఆధారిత మోటరైజ్డ్ ట్రైసైకిళ్లు – 4
సాథి మోడల్ వీల్‌చైర్లు – 48
ఇతర అవసరమైన సహాయక ఉపకరణాలతో కలిపి మొత్తం 394 పరికరాలు
అలింకో సంస్థ ద్వారా పంపిణీ చేసిన ఈ సహాయక పరికరాల మొత్తం విలువ రూ.22,13,708 (సుమారు రూ.22.14 లక్షలు).
ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ బొబ్బల శ్రీనివాస యాదవ్, ఏఎంఓ సుధీర్ బాబు, ఐఈ కోఆర్డినేటర్ ప్రసాద్ రావు, నెల్లూరు మండల విద్యాశాఖాధికారి మురళి, అలింకో ప్రతినిధి సోని యాదవ్, సమగ్ర శిక్ష సెక్టోరియల్ అధికారులు, ఐఈఆర్‌పీలు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.



