శ్రీకాకుళం, జూన్ 5 : పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని ఆంధ్ర ప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి పర్యావరణ ఇంజనీరు ఎస్.శంకర్ నాయక్ అన్నారు. శుక్రవారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా నగరంలోని గుజరాతిపేట పి.యన్.కాలనీలో గల కాలుష్య నియంత్రణ మండలి కార్యాలయంలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా పర్యావరణ ఇంజనీరు మాట్లాడుతూ ప్రపంచం కాలుష్య కోరల్లో చిక్కు కుందని, మన పర్యావరణాన్ని మనమే కాపాడుకోవాలన్నారు. ప్రస్తుతం వాతావరణంలో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోయాయని, ఒకప్పుడు పేదవాడి ఊటీ గా పేరొందిన శ్రీకాకుళంలో కూడా అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయన్నారు. ప్రతి ఒక్కరు ఒక మొక్కను నాటి దాని సంరక్షణ చూడాలని, వృక్ష సంపద ఎంత పెరిగితే మనం అంత పరిరక్షించ బడతామని ఆయన పేర్కొన్నారు. అనంతరం తమ సిబ్బందితో “పర్యావరణ పరిరక్షణ ప్రతిజ్ఞ” చేశారు. నగరంలో పలు కూడళ్లలో పర్యావరణంకు సంబంధించిన బ్యానర్లు, గోడ పత్రికలు అతికించారు. కరపత్రాలను పంపిణీ చేశారు. కోవిడ్-19 నిబంధనల ప్రకారం సామాజిక దూరం పాటిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. పలు పరిశ్రమల్లో మొక్కలు నాటే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో కాలుష్య నియంత్రణ మండలి సహాయ ఇంజనీర్లు బి.కరుణశ్రీ, సి.హెచ్.హరీష్, కార్యాలయ సిబ్బంది, క్షేత్ర సిబ్బంది పాల్గొన్నారు.